భారత్‌పై, ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఆ మంత్రలు మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది. బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటూ హ్యాష్ ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు ఆ దేశానికి ట్రిప్‌లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఈజ్ మై ట్రిప్ తన ప్యాకేజీలను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. మాల్దీవుల రాయబారికి సమన్లు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించింది. మాల్దీవుల ఇష్యూకు సంబంధించిన మంత్రులు చేసిన వ్యాఖ్యలపై వివరణ తీసుకునే అవకాశం ఉంది.
Also read:శ్రీరామనవమి రోజున రాములవారిని తాకే సూర్యకిరణాలు..అయోధ్యలో అద్భుతం
మంత్రుల సస్పెండ్..
మరోవైపు మాల్దీవుల మంత్రులుచేసిన వ్యాఖ్యల మీద ఆ దేశ ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. సోషల్ మీడియాలో భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మాల్షా షరీఫ్, మరియం షువానా, అబ్దుల్లా మాజిద్ సహా వివిధ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు తమ వారు చేసినది తప్పే అంటూ సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. వారు చేసిన వ్యాఖ్యలు కేవలం వారి వ్యక్తిగతంగా చేసినవని.. వాటితో మాల్దీవులు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. మరోవైపు మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా ఈ వ్యాఖ్యలను సిగ్గుచేటు, జాత్యహంకారం అని అభివర్ణించారు. ఇక సిట్టింగ్ ఎంపీ ఎంఎస్ అబ్దుల్లా అయితే తాను భారతదేశానికి క్షమాపనలు చెప్పాలనుకుంటున్నాని అన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు...
భారత ప్రధాని మోడీ రీసెంట్‌గా లక్షద్వీప్‌లో పర్యటించారు. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. వీటినచూసి చాలా మంది నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు బొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇలాంటి మాటలతోనే పోస్ట్‌లు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు.