గత ఏడాది అక్టోబర్‌లో మొదలైన ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. అలాగే ఇటీవల ఇరాన్‌పై కూడా దాడులు జరగడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు వెళ్లకూడదంటూ భారత పౌరులకు సూచనలు చేసింది. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలని పేర్కొంది. ఇజ్రాయెల్‌పై.. ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.
Also read: పంజాబ్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు!
అలాగే ప్రస్తుతం ఇజ్రాయెల్ లేదా ఇరాన్‌లో ఉంటున్నవారు స్థానిక భారత రాయబార కార్యలయంతో టచ్‌లో ఉండాలని విదేశాంగ సూచనలు చేసింది. అక్కడ తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పింది. పౌరులు తమ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని.. అలాగే బయటి కార్యకలాపాలను సాధ్యనమైనంత వరకు తగ్గించుకోవాలని సూచించింది. ఇదిలాఉండగా.. ఇటీవల ఇరాన్‌లోని డమాస్కస్‌లో రాయబార కార్యాలయంపై దాడి జరగడం కలకలం రేపింది.
ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఏడుగురు జనరల్స్ మృతి చెందారు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తోంది. అలాగే ఈ దాడికి పాల్పడ్డవారిని శిక్షిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తోంది. నేరుగా కాకుండా.. లెబనాన్ లేదా సిరియా నుంచి తమ మద్దతుదారులైన హెజ్‌బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.