Fake Toll Plaza : సాధారణంగా జాతీయ రోడ్డుపై వెళ్లేటప్పుడు టోల్ ప్లాజా(Toll Plaza) రాగానే అక్కడ డబ్బులు చెల్లిస్తారు. కానీ గుజరాత్‌లో మాత్రం కొంతమంది కేటుగాళ్లు ఏకంగా నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి ఏడాదిన్నర కాలం పాటు వాహనాదారుల నుంచి కోట్లు వసూలు చేశారు. తాజాగా బయటపడ్డ ఈ వ్యవహారం దూమారం రేపింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8ఏ నంబర్ జాతీయ రహదారిపై వాఘసియా అనే ఓ టోల్ ప్లాజా ఉంది. ఈ టోల్ ప్లాజా మీదుగా వెళ్లకుండా ఉండేందుకు కొంతమంది వాహనాదారులు పక్కనే ఉన్న వేరే మార్గం గుండా వెళ్లేవారు. అయితే దీన్ని గమనించిన కొందరు దుండగులు.. ఓ ప్లాన్ వేశారు. ఆ మార్గంలో వాడుకలో లేని ఓ సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దీనికి ఇరువైపుల హైవే వరకు బైపాస్ రోడ్డు నిర్మించి.. ఫ్యాక్టరీలో టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.
Also Read: మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!
దీంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనాదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా దుండగులు టోల్ ప్లాజా నడిపిస్తున్నట్లు తెలస్తోంది. అంతేకాదు హైవేలపై ఉండే టోల్ ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేయడం వల్ల వాహనదారులు కూడా దీనిపై ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు. ఇటీవల స్థానిక మీడియాల్లో ఈ వార్తలు బయటపడటంతో ఇక్కడ జరుగుతున్న అసలు వ్యవహారం బయటపడింది. చివరికి స్థానిక అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా.. ఓ ప్రముఖ నేత కొడుకు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ఏడాదిన్నర కాలంలో ఈ నిందితులు వాహనాదారుల నుంచి దాదాపు రూ.75 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా గుజరాత్ దాహోద్ జిల్లాలోని ఓ ఆరు నకిలి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఇటీవల సంచలనం రేపింది. ప్రభుత్వ కార్యాలయాలని ప్రజలను నమ్మించి గత కొన్నేళ్లుగా నిందితులు రూ.18 కోట్లు వసూలు చేశారు. ఎట్టకేలకు ఈ వ్యవహారం బయటపడటంతో పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కేసులో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు.