ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (BJD) పార్టీ ఘోర పరాజయం పొందింది. ఈ నేపథ్యంలో ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహితుడైన వీకే పాండ్యన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలను వదిలేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైగా ఒడిశాను పాలించిన బీజేడీ పార్టీ.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ చేతిలో దారుణంగా ఓడిపోయింది. మొత్తం 147 స్థానాలకు బీజేపీ 78 స్థానాల్లో గెలవగా.. బీజేడీ మాత్రం కేవలం 51 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ 14, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.
Also Read: నీట్ పేపర్ లీక్ అయ్యిందా ? పూర్తి కథనం..
తమిళనాడుకు చెందిన వీకే పాండ్యన్‌పై ఎన్నికల ప్రచారంలో బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. బీజేడీ మరోసారి గెలిస్తే.. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం కారణంగా.. వేరే రాష్ట్రానికి చెందిన పాండ్యన్ సీఎం అవుతారంటూ ఆరోపణలు చేసింది. తాము గెలిస్తే.. ఒడిశాలో పుట్టి, ఒడియా మాట్లాడే వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని జనాల్లోకి తీసుకెళ్లింది. చివరికి ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి అనంతరం పాండ్యన్ ఓ వీడియో సందేశం ఇచ్చారు. 'నవీన్ బాబుకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయల నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. బీజేడీ పార్టీ ఓడిపోవడంలో నా పాత్ర ఉన్నట్లైతే క్షమించండి' అంటూ పేర్కొన్నారు. అలాగే నవీన్ పట్నాయక్‌తో పనిచేయడం తనకు గౌరవంగా ఉందని.. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలు, అనుభవాలు జీవితాంతం ఉండిపోతాయని అన్నారు.