ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర వాతావరణంలో ముఖ్యంగా పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే తాజాగా భారత్ పాలస్తీనా ప్రజలకు మానవతా సాయంలో భాగంగా పలు వస్తువులు, ఔషధాలు పంపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై 5 వేల రాకెట్లతో మెరుపు దాడి చేసింది. అయితే ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఈ యుద్ధం మరింత తీవ్రతరం అయితే.. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను హెచ్చరించారు. టెల్ అవీవ్ పర్యటనలో భాగంగా ఆయన ఇలా స్పందించారు.
ఇరాన్‌కు ఒక విషయంపై స్పష్టతనిస్తున్నాం. మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం. ఒకవేళ ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చితే చివరికి అది మీ వరకూ వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన హమాస్ దాడులు ఇరాన్ సహాకారం లేకుండా జరిగాయని చెబితే అది హాస్యాస్పదమే అవుతుందని పేర్కొన్నారు. అలాగే తాను మద్దతు ఇచ్చే సంస్థలను ఈ యుద్ధంలోని ఇరాన్ గనుక దింపితే అది మరింత విస్తరించే ప్రమాదం ఉందని.. అమెరికా ఇటీవలే హెచ్చరించింది. అప్పుడు అమెరికన్లపై, సైనిక దళాలపై దాడులు జరిగినట్లేతే దీటుగా స్పందించడానికి రెడీగా ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు.
అయితే గాజాలోని హమాస్‌తో పాటు లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లాకు ఇరాన్ ప్రధాన మద్ధతుదారు. ఆ సంస్థలకు ఇరాన్ గుట్టుచప్పుడు కాకుండా నిధులు, ఆయుధాలను సరఫరా చేస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి. అమెరికా మధ్యవర్తిత్వం వల్ల ఇజ్రాయెల్-సౌదీ అరేబీయా దేశాల మధ్య ఒప్పందం అమల్లోకి వచ్చినట్లైతే ముస్లీం దేశాల్లో పలుకుబడి ఉన్న ఇరాన్‌కు ఎదురుదెబ్బ తగులుతుంది. అందుకోసమే హమాస్‌తో కలిసి ఇరాన్ దాడులు చేయించిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇరాన్ పాత్ర లేదని సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు.