ఐస్‌ల్యాండ్‌లో రెక్జానెస్ అనే ద్వీపకల్పంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ప్రభావానికి జనావాసాలకు లావా చేరింది. దీంతో ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న గ్రిండావిక్ ప్రాంతంలో పలు ఇళ్లు కాలిపోవడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకోబ్స్‌డోట్టిర్.. ఇది గ్రిండావిక్‌కు చీకటి దినమని అన్నారు. ఈ ముప్పు నుంచి స్థానికులు కలిసికట్టుగా బయటపడాలని సూచనలు చేశారు.
Also read: మాంజా మర్డర్స్.. చైనా దారంతో దారుణాలు.. తప్పెవరిది?
సురక్షిత ప్రాంతాలకు స్థానికులు
అయితే ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం బద్దలైతే ఇక్కడికి లావా రావచ్చనే ప్రజల్లో ఎప్పటినుంచో భయాందోళనలు ఉన్నాయి. అందుకే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి రాళ్లతో ఎత్తైన గట్టును స్థానికులు నిర్మించారు. అయినా కూడా లావా దాన్ని దాటుకొని మరీ జనావాసాల్లోకి వచ్చింది. ప్రస్తుతం స్థానికులు తమ ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. వారి పెండు జంతువులు, పశువులను కూడా వెంట తీసుకెళ్తున్నారు. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కాస్త ఊరటనిచ్చింది.
నెల వ్యవధిలో రెండోసారి
ఇక్కడ నివసించే ప్రజలు.. చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటారు. మరోవిషయం ఏంటంటే ఇక్కడ నెల వ్యవధిలోనే అగ్నిపర్వతం బద్దలుకావడం ఇది రెండోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తమ దేశంలో బ్లూలాగూన్ అనే పర్యాటక ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 16 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే లావా వ్యాపిస్తున్న ప్రాంతానికి ఈ ప్రదేశం చాలా దూరంలో ఉందని అధికారులు అంటున్నారు.
Also read: రామాలయ ప్రారంభోత్సవం.. అమెరికాలో 21 నగరాల్లో రామభక్తుల ర్యాలీలు..