Hydra Commissioner Ranganath: హైడ్రా.. ఈ పేరు వింటే ఆక్రమణల అక్రమాలతో ఆస్తులు పెంచుకున్న బడా బాబులకు నిద్ర పట్టడం లేదు ఇప్పుడు. ఎప్పుడు ఎవరివైపు హైడ్రా బుల్ డోజర్ వస్తుందో అనే టెన్షన్ తో ఉన్నారు. కొందరైతే ముందుగానే భుజాలు తడుముకుంటూ తమది పట్టా భూమి అనీ.. చెరువులు ఆక్రమించలేదనీ.. తమకు చెందిన స్థలంలోనే కట్టడాలు చేశామని ఇలా రకరకాలుగా మీడియా ముందుకు వచ్చి చెప్పేసుకుంటున్నారు. ఒకవిధంగా చూస్తే చాలామంది తమ ఆస్తుల వివరాలు నేరుగా వివరించేస్తున్నారు. ఇది డబ్బున్న వాళ్లు.. సెలబ్రిటీలు చేస్తున్న హంగామా. అయితే, మరోవైపు మధ్యతరగతి ప్రజలు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ బ్యాంకు లోన్లతో అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ లేదా ఇళ్లను కొనుక్కున్న వారికీ కూడా భయం ఆవరించింది. తమ అపార్ట్మెంట్ లకు అన్నిరకాల పర్మిషన్లు ఉన్నాయని బిల్డర్లు చెప్పడం.. సంబంధిత డాక్యుమెంట్స్ చూపించడం.. రిజిస్ట్రేషన్ కూడా పక్కా కావడంతో తాము ఇళ్లను కొనుక్కున్నామనీ.. ఇప్పుడు చెరువులు.. బఫర్ జోన్ లు (Buffer Zone) అంటూ ఇళ్లను కూల్చేస్తుంటే.. రేపు మా ఇల్లు కూడా కూల్చేస్తే మా పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. నాగార్జున (Nagarjuna) లాంటి సెలబ్రిటీనే వదిలిపెట్టని హైడ్రా తమ ఇళ్ల మీదకు వస్తే తమకు కలిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఉన్నాయనే ఇల్లు కొనుకున్నాం. ఇప్పుడు ఎదో రూల్స్ చెబితే ఎలా అని వాపోతున్నారు. ఇల్లు అనేది సామాన్యుడి కల. దాదాపుగా అందరూ అప్పులు చేస్తి మరీ ఇల్లు కొనుక్కుంటారు. ఇప్పుడు హైడ్రా నిబంధనల పరిధిలోకి తమ ఇల్లు లేదా ఫ్లాట్ వస్తే ఏం చేయాలనేది వారి ఆవేదన.
ఇదిగో ఈ ఆవేదనకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. బఫర్ జోన్ అంటే ఏమిటి? నాగార్జున ఎన్ కన్వెన్షన్ (Nagarjuna N Convention) ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? ఇప్పుడు సామాన్యుల ఇళ్లను కూల్చేయాల్సి వస్తే ఏం చేస్తారు? వంటి విషయాలను ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా వివరించారు. అవేమిటో వరుసగా తెలుసుకుందాం..
బఫర్ జోన్ అంటే ఏమిటి?
Hydra Ranganath: ఒక చెరువు, నది, సముద్రం ఇలాంటి నీటి వసతులున్న చోట్ల అవి పొంగినపుడు వచ్చే నీరు ఎంత ప్రాంతం ముంచేసే వీలుంది అనే లెక్కను బట్టి ఆ మేరకు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయకుండా నిబంధన విధించారు. ఎందుకంటే, వరదల్లో పొంగిన నీరు ఆ నిర్మాణాలను ముంచెత్తితే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాల్లో కట్టడాలకు అనుమతి ఉండదు. దీనినే బఫర్ జోన్ అంటారు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ అందుకే కూల్చేశారు..
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సక్రమమే అని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాధ్. బఫర్ జోన్ లో ఉన్న స్థలాలకు పట్టా ఉండవచ్చు. దానిని కొనుగోలు చేయడం కూడా తప్పు కాదు. అయితే, ఆ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు నిర్మించకూడదు. వ్యవసాయ పరంగా ఆ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎన్ కన్వెన్షన్ విషయంలో అదే జరిగింది. బఫర్ జోన్ లో కాంక్రీట్ నిర్మాణాలు చేశారు. అది నిబంధనలకు విరుద్ధం అక్కడ వ్యవసాయానికి చెందిన పనులను నిర్వహించుకుంటే వాటి జోలికి వెళ్లే అవసరమే వచ్చేది కాదు. కాంక్రీటు గోడలు బఫర్ జోన్ లో నిర్మించినందుకే దానిని తొలగించాల్సి వచ్చింది అని రంగనాధ్ వివరించారు.
సామాన్యులకు టెన్షన్ వద్దు..
Hydra Ranganath: “హైడ్రా అనేది జూలై నెలలో ఏర్పాటయింది. మా మొదటి ప్రియారిటీ చెరువుల స్థలాలు ఆక్రమించుకుని.. బఫర్ జోన్ లో కి చొచ్చుకు వచ్చిన పెద్ద పెద్దవారి అక్రమ నిర్మాణాలు మాత్రమే. పేద, మధ్యతరగతి ప్రజల విషయంలో మేము తొందరపడబోము. అటువంటి వారికి సంబంధించిన కట్టడాలను మేము టచ్ చేయబోవడం లేదు.” అంటూ రంగనాధ్ కచ్చితంగా ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతోనే తాము వ్యవహరిస్తామనీ.. ఒకవేళ తరువాత ఇలాంటి కట్టడాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తే, దానిని ఏవిధంగా చేయాలి? అక్కడి ప్రజలకు న్యాయం జరిగేలా ఎలా వ్యవహరించాలి? అనే విషయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం మా టార్గెట్ మాత్రం చెరువులను పెద్ద ఎత్తున ఆక్రమించి వ్యాపారాలు చేస్తూ వస్తున్న వారు మాత్రమే అని రంగనాధ్ చెప్పారు.
మొత్తంగా చూస్తే హైడ్రా ఇప్పుడు కేవలం పెద్ద తలకాయలు.. సెలబ్రిటీలు.. రాజకీయ నేతలపైనే దృష్టి సారించినట్టు అర్ధం అవుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చని రంగనాధ్ మాటల ద్వారా స్పష్టం అయింది.