Rains: ఈ ఏడాది వేసవి కాలం (Sunmer) ఇంకా పూర్తిగా మొదలు కాకముందు నుంచే సూర్యుడు ప్రజల మాడు పగలగొడుతున్నాడు. తగ్గేదేలే అంటూ రోజురోజుకి ఉష్ణోగ్రతలను ఓ రేంజ్ కు పెంచేస్తున్నాడు. దీంతో ప్రజలు ఉదయం 8 దాటిన తరువాత బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ చల్లటి కబురు చెప్పంది.
రాష్ట్రంలో వర్షాలు(Rains) కురుస్తాయని వివరించింది. తెలంగాణలో (Telangana) బుధవారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
దీంతో పాటు కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది. సోమవారం నిజామాబాద్ లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లుగా వాతావరణ కేంద్రం వివరించింది. ఇప్పటికే సీజన్ లో పండే మామిడి పంట చేతికి వచ్చే సమయంలో వానలు పడతాయని అధికారులు చెప్పడంతో రైతులు కంగారు పడుతున్నారు.
అయితే ఈసారి తెలంగాణలో చాలా చోట్ల సాగు నీరు లేక భూములు పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి . దీంతో వాతావరణశాఖ వర్ష సూచన ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుముల కారణంగా మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also read: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ .. ఇక నుంచి ఆ సౌలభ్యం ఉండదు!