ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని నీటమునిగాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ నగరం జలమయమైంది. సింగ్‌నగర్, అంబాపూరం, రాజీవ్ నగర్, జక్కంపూడి తదితర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. చాలా కాలనీల్లో 5 నుంచి 7 అడుగుల వరకు వరద నీరు చేరింది. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడలో వరద పరిస్థితిని RTV డ్రోన్ విజువల్స్‌తో ప్రపంచానికి చూపిస్తోంది. కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. ప్రకారం బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవిహిస్తోంది. రాత్రికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద మరింత పెరిగితే 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
విజవాడ పరిస్థితిని గమనిస్తే సింగ్‌నగర్ మొత్తం నీటమునిగింది. అనేక ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలోకి వరద చేరింది. అక్కడి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలు ఆగిపోయాయి. పలు ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. మరికొన్ని భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. అక్కడ నివసించేవారు బయట కాలు పెట్టని పరిస్థితి నెలకొంది. ఇందిరానగర్‌లో కూడా పూర్తిగా జలదిగ్బంధమైంది. అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లతో పాటు పెట్రోల్ బంక్, బైక్ షో రూం లాంటి కంపెనీలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి.
Also Read: నీట మునిగిన థర్మల్ పవర్ స్టేషన్.. రంగంలోకి దిగిన చంద్రబాబు!
పాతరాజేశ్వరి, కొత్తరాజేశ్వరి ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడ పేదలు కొన్ని షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. భారీ వర్షాల ప్రభావానికి అవన్నీ కూడా మునిగిపోయాయి. రోడ్లపై నీరు నడుం లోతు వరకు చేరింది. ప్రకాశ్‌నగర్ పైపుల రోడ్డులో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలు ఇళ్లన్నీ నీటమునిగాయి. మరికొన్ని అపార్ట్‌మెంట్‌లలు కూడా జలదిగ్బంధమయ్యాయి. రైల్వే ట్రాక్‌లు మునిగిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది రక్షిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. గుంటూరు బస్టాండ్ నీటమునగడంతో అధికారులు దాన్ని ముసివేశారు. ప్రస్తుతం అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. మరో 24 గంటల పాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పల్నాడు, ఎన్టీఆర్, గంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.