Heavy Rain Alert in Telangana: ఎండాకాలం ఎఫెక్ట్ తో ఇరవై రోజులుగా వేడెక్కిపోతున్న తెలంగాణ ఒక్కసారిగా చల్లబడింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడటం వల్ల రానున్న రెండు నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ (IMD) తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
ఎత్తైన ఉపరితల ద్రోణి..
ఈ మేరకు దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లో (Hyderabad) ఆకాశం మేఘావృతమైంది. జంటనగరాల్లో సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Pollution: పెను ప్రమాదంలో హైదరాబాద్.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో షాకింగ్ నిజాలు!
ఇక ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని, గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 4 నుంచి 6 కి.మీ వేగంతో ఉపరితల గాలులు దక్షిణ, నైరుతి దిశగా వీస్తాయని చెప్పారు. ఇక గత రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీలు ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు నమోదైంది.