Heavy Rain Alert For AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మండుతున్న ఎండలకు చెక్ పెడుతూ..ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడడంతో ప్రజలు మండే ఎండలనుంచి ఉపశమనం పొందారు.
ఈ క్రమంలోనే ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు.
Also Read: తక్కువ నీరు తాగడం వల్ల తీవ్రమైన కిడ్నీ వ్యాధి సంభవిస్తుంది…రోజులో ఎంత నీరు తాగాలంటే!
అదే సమయంలో సత్యసాయి, విజయనగరం, ప్రకాశం, మన్యం, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. ఉరుములతో కూడి వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే వారు, రైతులు, పశువుల కాపరులు చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు తెలిపారు.
కాగా, మంగళవారం ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిశాయని వెల్లడించారు. సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5 , కోనసీమ జిల్లా మండపేటలో 120.5, రాజమండ్రిలో 92, కోనసీమ జిల్లా తాటపూడిలో 75.5, ఏలూరు జిల్లా నూజివీడులో 73.5, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు వివరించారు.