ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో ఆసక్తికర సంఘటన జరిగింది. విందులో చేపల కూర, మాంసం పెట్టకపోవడంతో పెళ్లి కొడుకు తరుఫు బంధువులు, పెళ్లి కూతురు తరుఫు బంధువుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విందులో మాంసం పెట్టలేదని వరుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి కర్రలతో వధువు తరుఫు బంధువులపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ శర్మ కూతురు సుష్మను పెళ్లి చేసుకునేందుకు అభిషేక్ శర్మ, అతని బంధువులు డియోరియా జిల్లాలోకి ఆనంద్ నగర్ అనే గ్రామానికి వచ్చారు.
Also Read: దారుణం.. కూతురు ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన తండ్రి
విందులో మాంసాహారం లేదని వధువు తరఫు బంధువులు వరుడి బంధువులకు చెప్పారు. దీంతో వరుడి తండ్రి సురేంద్ర శర్మ, మిగతా బంధువులు కలిసి నాన్‌వెజ్ పెట్టకపోవడంపై పెళ్లి కూతురు తరఫున వాళ్లను అసభ్యకరంగా తిట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అక్కడి నుంచి పెళ్లి కొడుకు పారిపోయాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కొడుకు, అతని ఫ్యామిలీ తమపై దాడి చేసి.. రూ.5 లక్షల కట్నం ఇవ్వాలంటూ డిమాంట్ చేసినట్లు ఫిర్యాదులో చెప్పారు.