Jharkhand : జార్ఖండ్ లోని మురిప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిస్కా గ్రామంలో ఎద్దు బావిలో పడింది. దానిని రక్షించే క్రమంలో ఐదుగురు రైతులు మరణించారు. ఈ ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. సిల్లిలోని మురి ప్రాంతంలో ఉన్న పిస్కా గ్రామంలోని బావిలోపడి ఐదుగురు రైతులు మరణించారనే విషాద వార్తతో నా మనస్సు కలత చెందిందని ఆయన ట్వీట్ చేశారు. భగవంతుడు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని... ఈ కష్టమైన ఘడియను తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
పిస్కా గ్రామంలో ప్రమాదవశాత్తు ఒక ఎద్దు వ్యవసాయ బావిలో పడింది. అది గమనించిన రైతు...చుట్టుపక్కల ఉన్న రైతుల తెలియజేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎలాగైనా ఎద్దు రక్షించాలని బావిలోకి దిగారు. మొత్తం ఏడుగురు బావిలోకి దిగారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పై నుంచి మట్టి పడటంతో..అందరూ అందులో చిక్కుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దర్నీ సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.