Hydra Commissioner: ఎవరైనా నిజాయితీగా ఉంటే పెనుముప్పు తప్పని రోజులివి. ఎవరైనా ఏదైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తేనే వారిపై దాడులకు తెగబడతారు. అలాంటిది ఏకంగా అక్రమార్కుల ఆక్రమణలను కూల్చివేస్తే.. ఎవరేమన్నా వెనక్కి తగ్గకుండా బుల్డోజర్ నడిపిస్తే.. కచ్చితంగా ఆ అధికారిపై అక్రమార్కులకు మంట పుడుతుంది. నయానో.. భయానో సదరు అధికారిని లొంగ తీసుకునే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇలాంటిది ఏదైనా హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో జరగొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Hydra Commissioner: హైదరాబాద్ లో చెరువులను ఎడా పెడా ఆక్రమించేసి.. ఆస్తులు.. అంతస్తులు కూడగట్టుకున్న బడాబాబులకు హైడ్రా కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరు వినపడితేనే అక్రమార్కులు ఉలిక్కి పడేలా పరిస్థితి ఉంది ఇప్పుడు. ఐపీఎస్ రంగనాధ్ నాయకత్వంలో హైడ్రా బుల్ డోజర్లు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రంగనాధ్ కు థ్రెట్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమార్కులను నిలువరిస్తూ వస్తున్న అధికారి రంగనాధ్ కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర పోలీసు భద్రతను భారీగా పెంచారు. ఇందుకోసం మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు.
Hydra Commissioner: ఇటీవలే సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని తరువాత ప్రముఖ రాజకీయ నాయకుల కట్టడాలు హైడ్రా లిస్టులో ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తమ్మిడికుంట చెరువులోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ తో పాటు చుట్టు పక్కల ఉన్న పలు ఇతర కట్టడాలను కూడా అధికారులు కూల్చేశారు. మెటల్ చార్మినర్ లోపలివైపు ఉన్న స్క్రాప్ గోదాములు, వర్క్‌షాపులు, అలాగే నీటిని తోడి ట్యాంకర్లకు విక్రయించే షెడ్లు.. తదితర వాటిని కలిపి మొత్తం 20కి పైగా నిర్మాణాలను నేలమట్టం చేశారు. చెరువు వెనుక భాగాన భారీగా పేరుకుపోయిన జీవ వ్యర్థాల మూటలను చూసి అధికారులు షాకయ్యారు. గోశాల, క్రికెట్ నెట్లు, ఇతరత్రా నిర్మాణలు, అలాగే టీఎస్‌ఐఐసీ వైపు నుంచి చెరువులోకి చొచ్చుకొస్తున్న చెత్తకుప్పలు, నిర్మాణ వ్యర్థాల గుట్టల అంశంలో కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Also Read : 10, 20, 30 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి విలువ ఎంత అవుతుంది