Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి సొంత పార్టీ అధినేత కేసీఆర్ (KCR) పై వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తమ కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నామని అన్నారు. అయితే.. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) చిచ్చులు పెట్టాయి. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
నా కొడుక్కి ఎంపీ టికెట్...
తెలంగాణ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచిన.. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం కుంగిపోకుండా రాబోయే లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections) వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కీలక విషయాలు వెల్లడించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి (Bhadra Reddy) మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. కేసీఆర్ కూడా తన కొడుక్కి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఫిక్స్ అయినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించక ముందే మల్లారెడ్డి (Malla Reddy) ఈ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయతీకి తెర లేపినట్లయింది.
Also Read: రైతులకు గుడ్ న్యూస్…సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!
జగ్గారెడ్డి భజన కార్యక్రమం...
కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై (Jaggareddy) సెటైర్లు వేశారు మల్లారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయినా జగ్గారెడ్డి.. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగ్గారెడ్డి ఫెమస్ కావడం కోసం తన పేరు ఎత్తుతున్నారని అన్నారు. తన పేరు ఎత్తకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరని చురకలు అంటించారు.