రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తాజాగా చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అక్కడ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ తన ప్రసంగం ప్రారంభించారు. దీంతో ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు తాజాగా బయటపెట్టాయి. అలాగే ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్.. ముడో శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడానికి పుతిన్ ఇటీవల చైనాలో పర్యటించారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్‌తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ముందుగా.. ఈ వేదికపై తొలుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రసంగించారు. ఆ తర్వాత పుతిన్ ప్రసంగించారు. ఆ సమయంలో ఫ్రాన్స్ (France) మాజీ ప్రధాని జీన్ పెర్రీ రఫరీన్‌తో పాటు కొందరు ఐరోపా నేతలు.. అలాగే ప్రతినిధులు సభా ప్రాంగణం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. పుతిన్ తన ప్రసంగాన్ని మొదలుపెడుతుండగా.. వారు హాల్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలను కొందరు చైనా విలేకరులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అయితే చైనా పర్యటనలో భాగంగా పుతిన్.. నిన్న జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంట నుంచి గంటన్నర వరకు ఈ సమావేశం జరిగింది. ముందుగా అధికారుల సమక్షంలో ఇరు దేశాల అధినేతలు చర్చించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రైవేటుగా మాట్లాడుకున్నారు. అయితే ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు వ్లాదిమీర్ పుతిన్ తెలిపారు. అయితే ఇందులో కొన్ని రహస్య అంశాలూ కూడా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ సమావేశం కూడా బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లోనే జరిగింది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో పుతిన్, జిన్‌పింగ్‌లు కలుసుకోవడం ఇది రెండోసారి. మార్చిలో చైనా అధ్యక్షుడు రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఏడాది మార్చిలో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ అయిన అనంతరం.. పుతిన్ మాజీ సోవియట్ రిపబ్లిక్స్‌లో కాకుండా ఇతర దేశంలో పర్యటించారు. ఆయన ఇలా ఇతరదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.