ఛత్తీస్‌ఘడ్‌లో ఒకవైపు ఎన్నికలు మరోవైపు మహదేవ్ బెట్టింగ్ యాప్ గోల. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ బెట్టింగ్ యాప్ ఆగమాగం చేస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కు 508 కోట్లు అందాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఓ కొరియర్ సంస్థ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర డబ్బులు దొరికాయని కూడా చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు మహదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్లలో ఒకరైన శుభమ్ సోనీ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో తాను యాప్ పెట్టడానికి కారణం సీఎం బఘేల్ అని సోని ఆరోపించాడు. దాంతో పాటే 508 కోట్లు చెల్లించానని కూడా ఒప్పుకున్నాడు. యాప్ విషయంలో తన స్నేహితులను అరెస్ట్ చేసినప్పుడు బఘేలే తనను యూఏఈ పారిపోవాలని సలహా ఇచ్చారని కూడా సోని చెప్పాడు. ఈ వ్యవహారం నుంచి తనను బయటపడేయాలంటూ భారత ప్రభుత్వాన్ని అర్ధించాడు కూడా.
Also Read:ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఏపీ హైకోర్టులో విచారణ
ఇప్పుడు ఇదే విషయం మీద ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. నవంబర్ 17వరకు ఎంజాయ్ చేయండి అంటూ తన మీద వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. ఈ బెట్టింగ్ యాప్ చూపిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందని...దీని మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలు ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపించదని బఘేల్ వ్యాఖ్యానించారు. ఎన్నికలను ప్రభావితం చేసే ఇలాంటి చర్యలను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. దీని మీద తమ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ఆధారంగా వాటిని పరిశీలించాలని ఆయన కోరారు.