క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin tendulkar) కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Election comission) రెడీ అయింది. ఇక నుంచి సచిన్ ను ఎన్నికల సంఘానికి నేషనల్ ఐకాన్(National icon) గా నియమించనుంది. ఎన్నికల ప్రక్రియలో ఎక్కువ మందిని పాల్గొనేలా చేయాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళ వారం వెల్లడించింది.
నేషనూల్ ఐకాన్ గా నియమించే విషయంలో ఎన్నికల సంఘంతో ఒప్పందంపై సచిన్ టెండూల్కర్ రేపు సంతకం చేస్తారని తెలుస్తోంది. సచిన్ ఈ పదవిలో మూడేండ్ల పాట కొనసాగనున్నారు. నేషనల్ ఐకాన్ గా వున్న సమయంలో ఆయన దేశ వ్యాప్తంగా ఉన్న ఓటర్లకు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి అవగాహన కలిగించనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో సచిన్ ప్రభావం చాలా వుంటుందని వెల్లడించింది. గతంలో కూడా పలువురు ప్రముఖులను ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్ గా నియమించింది. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా నేషనల్ ఐకాన్ గా వ్యవహించారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్ లు ఆడారు. టెస్టుల్లో ఆయన 51 సెంచరీలు, 68 అర్థ సెంచరీలు చేశారు. మొత్తంగా 53.78 సగటుతో 15,921 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోరు 248 పరుగులు. ఇక ఆయన 463 వన్డేలు ఆడిన ఆయన 44.83 సగటుతో 18,426 పరుగులు చేశారు. మొత్తం 49 సెంచరీలు, 96 అర్థ సెంచరీలు చేశారు.
టెస్టులు, వన్డే ఫార్మాట్స్ లో కలిపి ఆయన మొత్తం 664 మ్యాచ్ లు ఆడారు. 48.52 బ్యాటింగ్ సగటుతో 34,357 పరుగుల చేశారు. రెండు ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు, 164 అర్ద సెంచరీలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా ఆయన పేరిట ఉంది. క్రీడా రంగంలో ఆయన చేసిన సేవలకు ఆయనకు కేంద్రం భారత రత్న అవార్డు కూడా అందజేసింది.