ఎమ్మెల్సీ కవితపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇస్తే కవిత హై కోర్టుకు వెళ్లిందన్న ఆయన.. కవిత చెప్పిన విషయాన్పి కోర్టు ఎలా నమ్మిందన్నారు. గుంటూరులోని సీపీఐ పార్టీ కార్యాయలంలో సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశం అనంతరం మీడియాతో మట్లాడారు. ఈడీ నోటీసులు పంపితే తనకు వీలు చిక్కినప్పుడే విచారణకు వస్తానని కవిత చెప్పడం ఏంటన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కూతురు కాబట్టి కవిత ఆడిందే ఆటగా మరిందని నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజామాబాద్‌లో పర్యటించే సమయంలో లేని బిజీ ఈడీ నోటీసులు ఇస్తే వచ్చిందా అని ప్రశ్నించారు.
మరోవైపు సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన నారాయణ రాష్ట్రంలో అంతా అవినీతి పాలన కొనసాగుతోందని విమర్శించారు. అవినీతి సీఎం తన కుటుంబ సభ్యులతో అవినీతికి పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకునే కేసీఆర్.. తన పేరు బయటకు రాకుండా లిక్కర్ స్కామ్‌లో తన కూతరును ఇరికించారన్నారు. ఒకవేళ కేసీఆర్ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుంటే కేంద్రంలో ఉన్న పార్టీకి ఏజెంటుగా పనిచేయాల్సి వస్తోందని భావించి తన కూతురుతో లిక్కర్ బేరాలు నడిపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం ప్రారంభించిన పాలమూరు ఎత్తిపోతల పథకం వరకు అంతా అవినీతి మయమే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కేసీఆర్ రాష్ట్రంలో పేరుకే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, అందులో కూడా అవినీతే ఉందన్నారు. దళిత బంధులో బీఆర్‌ఎస్ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందే వారి నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్న కమీషన్లలో కేసీఆర్‌కు వాటా ఉందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.