వరద ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ, కాంగ్రాస్ ప్రచార కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ముంపునకు గురైన బొక్కల గడ్డ (Bokkala gadda) ప్రాంతంలో పర్యటించిన ఆయన.. ఇంటింటికీ తిరుగుతూ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరు (Munneru) వాగు సైతం ఏ సంవత్సరం లేని విధంగా ఉధృతంగా ఉందని వరద మరోసారి పెరిగినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. ముంపు ప్రాంత వాసులు బయట తిరుగొద్దని, పదునుగా ఉన్న విద్యుత్ స్థంభాలను ముట్టుకోవద్దని, వరద ఉధృతి ఉన్న ప్రాంతాలవైపు వెళ్లొద్దని సూచించారు.
గత సంవత్సరం భద్రాచలంలో భారీగా వరదలు వచ్చాయని, ఆ సమయంలో సీఎం కేసీఆర్ (kcr) పర్యటించి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ మాట ఇచ్చి సంవత్సరం దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆరోపించారు. కేసీఆర్ (kcr) ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే ఉండిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం మున్నేరు ప్రాంతంలో పర్యటించిన ఓ వ్యక్తి కరకట్ట ఎలా నిర్మిస్తారు మట్టిగడ్డలతోనా అని వెటకారం చేశారని పొంగులేటి గుర్తు చేశారు.
ఆ నాయకుడు ఏనాడైనా నిర్మాణాలు చేపడితే కరకట్ట గురించి తెలిసేదని మాజీ ఎంపీ ఎద్దేవా చేశారు. చిన్నవర్షం కురిసినా మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోందన్నారు. ఇంత వరకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) వరద బాధితులను పరామర్శించి పాపాన పోలేదన్నారు. ఎన్టీఆర్ (ntr) విగ్రహం ఏర్పాటు చేయడంలో ఉన్నశ్రద్ధ వరద ప్రభావిత ప్రాంత వాసులను రక్షించడంలో లేదని విమర్శించారు. పువ్వాడకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని పొంగులేటి జోస్యం చెప్పారు.
2014లో బీఆర్‌ఎస్ (brs) అధికారంలోకి రాగానే అనేక పనులు చేస్తామని గొప్పలు చెప్పారని, రైతుల కోసం మంచి పాలన అందిస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ (kcr) మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. ఇళ్లు వరదల్లో మునిగిపోయి నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం 25 వేల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల మృతి చెందిన వారి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని మాజీ ఎంపీ స్పష్టం చేశారు.