ఢిల్లీ సర్వీసుల బిల్లుకు పార్లమెంటులో మద్దతునివ్వాలని, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని వైసీపీ (YCP)నిర్ణయించింది. మణిపూర్ (MANIPUR)వంటి రాష్ట్రాలు హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతుండగా ఈ దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కు అండగా ఉండాలని తాము నిర్ణయించామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తేవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వైసీపీ కి లోక్ సభలో 22 మంది సభ్యులు ఉన్నారు.
ఇక ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభలో మద్దతునివ్వాలని, విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభలో వ్యతిరేకించాలని తాము నిర్ణయించామని బిజూ జనతా దళ్ ఎంపీ శస్మిత్ పాత్రా వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తమ ఎంపీలంతా తప్పనిసరిగా ఉండాలని విప్ జారీ చేశామని ఆయన చెప్పారు. బిజూ జనతా దళ్ (BJD) కు లోక్ సభలో 12 మంది సభ్యులున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (CHANDRA BABU) నాయకత్వంలోని టీడీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎంపీలు తమ ఆత్మ ప్రబోధనానుసారం ఓటు వేయవచ్చునని తెలుస్తోంది. ఈ పార్టీ నుంచి 10 మంది ఎంపీలు లోక్ సభలో ఉన్నారు.
ఢిల్లీ సర్వీసుల బిల్లును వ్యతిరేకించాలని బీఆర్ఎస్ (BRS) నిర్ణయించింది. పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీ సభ్యులంతా తప్పనిసరిగా సభలో ఉండాలని విప్ జారీ చేసింది. సభలో ఎప్పుడు దీన్ని ప్రవేశపెట్టినా దీనికి వ్యతిరేకంగా ఓటు చేయాలని సూచించారు. బిల్లుపై ఓటింగ్ ముగిసేవరకు ఎంపీలంతా సభలోనే ఉండాలని పార్టీ కోరింది. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ ఇదివరకే ప్రత్యేకంగా నోటీసు నిచ్చింది. వివిధ రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైందన్న విషయం ప్రజలకు తెలియాల్సి ఉందని పార్టీ నేత నామా నాగేశ్వర రావు అభిప్రాయపడుతున్నారు.
అవిశ్వాస తీర్మానంపై 8నుంచి చర్చ
అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8,9, 10 తేదీల్లో సభలో చర్చ జరగనుంది. 10 న ప్రధాని మోడీ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఓ వైపు చర్చకు సిద్ధమని అంటూనే ప్రభుత్వం తమను అడ్డుకుంటోందని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లును పార్లమెంటులో ఆమోదింపచేసుకోవటంలోనూ, విపక్షాల అవిశ్వాస తీర్మాన గండం నుంచి బయటపడటంలో కూడా ఎన్డీయే సులభంగా గట్టెక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. లోక్ సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉంది. రాజ్యసభలోనూ కొన్ని మిత్ర పక్షాల కారణంగా ఈ తీర్మానం వీగిపోయేలా చూడడంలో ఎన్డీయే కృతకృత్యం విజయవంతమయ్యే అవకాశం ఉంది.