/rtv/media/media_files/2026/02/09/pubg-2026-02-09-07-46-47.jpg)
ఆన్‌లైన్ గేమ్‌లు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, యువత ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా మీరట్‌కు చెందిన 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అధిక రక్తపోటు కారణంగా మెదడులో రక్తస్రావం జరగడమే ఈ మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. ఖైర్‌నగర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ ఫరూఖ్ కుమారుడు కైఫ్ తండ్రికి వ్యాపారంలో సాయపడుతుండేవాడు. శుక్రవారం ఆఫీసులో కూర్చుని ఇయర్‌ఫోన్లు పెట్టుకుని పబ్జీ గేమ్‌లో మునిగిపోయాడు. గేమ్ ఆడుతుండగా తీవ్రమైన ఒత్తిడికి గురై కైఫ్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన తోటివారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని రక్తపోటు (BP) 300 దాటినట్లు డాక్టర్లు గుర్తించారు.
పరిస్థితి విషమించడంతో కైఫ్‌ను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కైఫ్, ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లి అంతర్గత రక్తస్రావం జరగడం వల్లే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మరువక ముందే ఘజియాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. భారత్ సొసైటీలో నివసిస్తున్న ముగ్గురు సోదరీమణులు కొరియన్ డ్రామా గేమ్‌కు బానిసలై, తొమ్మిదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
"కైఫ్ ఎప్పుడూ మొబైల్ ఫోన్‌తోనే గడిపేవాడు. గేమ్‌లు ఆడటంతో పాటు వీడియో రీల్స్ చేసేవాడు. వద్దని ఎన్నిసార్లు మందలించినా వినేవాడు కాదు" అని కైఫ్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఆన్‌లైన్ గేమ్‌ల పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిఘా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us