/rtv/media/media_files/2025/08/29/up-crime-2025-08-29-17-25-27.jpg)
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు మరో ఇల్లాలు బలి అయిపోయింది. వరకట్నం వేధింపులకు గురైన ఓ వివాహితకు ఆమె అత్తింటివారు బలవంతంగా యాసిడ్ తాగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వివాహిత 17 రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహ్‌పూర్ జిల్లాలో జరిగింది.
గుల్ ఫిజా అనే బాధితురాలికి ఏడాది క్రితం అమ్రోహాలోని కాలా ఖేడా గ్రామానికి చెందిన పర్వేజ్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి తన కుమార్తెను ఆమె భర్త, అత్తమామలు,ఇతర కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారని గుల్ ఫిజా తండ్రి ఫుర్ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
2025 ఆగస్టు 11న, గుల్ ఫిజా అత్తమామలు తన కూతురికి బలవంతంగా యాసిడ్ తాగించారని ఫిర్యాదులో ఆమె తండ్రి ఆరోపించాడు. దీంతో వెంటనే తమ కూతుర్ని మొరాదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ 17 రోజులు చికిత్స పొందిన గుల్ ఫిజాను వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు. చికిత్స సమయంలోనే ఆమె మరణించింది. పోస్ట్‌మార్టం కూడా మొరాదాబాద్‌లో జరిగింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, భర్త పర్వేజ్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, ఇతర అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోస్ట్ మార్టం నివేదిక తర్వాత నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
బెంగళూరులోనూ ఇలాంటి ఘటన
తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన శిల్ప (27) అనే యువతి అత్తింటి వారి చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే శిల్పకు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రవీణ్ అనే యువకుడితో వివాహమైంది.ఈ వివాహం కోసం శిల్ప తల్లిదండ్రులు సుమారుగా రూ. 40 లక్షలు ఖర్చు చేశారు. వారికి ఇప్పటికే ఏడాదిన్నర వయసున్న పాప కూడా ఉంది. మళ్లీ శిల్ప ప్రస్తుతం గర్భవతి. శిల్పకు పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు భర్త ప్రవీణ్, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం నిరంతరం వేధించడం ప్రారంభించారు.
అంతేకాకుండా ప్రవీణ్ తాను M.Tech గ్రాడ్యుయేట్ అని చెప్పి శిల్పను పెళ్లి చేసుకున్నాడు. కానీ ప్రవీణ్ అసలు ఎం.టెక్ చేయలేదు. పానీపూరీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత శిల్ప మరింత మానసిక వేదనకు గురైంది. దీనికి తోడు ప్రవీణ్, అతని తల్లిదండ్రులు తరచూ శిల్పను శారీరకంగా, మానసికంగా హింసించేవారు.నిజాయితీ లేని భర్త, తరచుగా వేధింపులతో శిల్ప తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోలేదని అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని శిల్ప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read : Indian Students: అమ్మో.. నేను పోను అమెరికాకు.. వీసా రూల్స్ తో వణుకుతున్న స్టూడెంట్స్!