Kill Cockroach: బొద్దింకలను కాల్చబోయి.. అపార్ట్‌మెంట్‌ను తగలెట్టిన మహిళ.. ఒకరు మృతి

దక్షిణ కొరియాలో ఓ మహిళ బొద్దింకను చంపేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. స్ప్రే ఉపయోగించి లైటర్‌తో నిప్పంటించడంతో ఆమె అపార్ట్‌మెంట్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

New Update
South Korean Woman Sets Apartment On Fire While Trying to Kill Cockroach

South Korean Woman Sets Apartment On Fire While Trying to Kill Cockroach

దక్షిణ కొరియాలో బొద్దింకను చంపేందుకు ఓ యువతి చేసిన ప్రయత్నం పెను ప్రమాదానికి దారి తీసింది. ఆమె అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి ఒక పొరుగు మహిళ మరణానికి కారణమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ యువతిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ సంఘటన దక్షిణ సియోల్‌లోని ఓసన్ నగరంలో సోమవారం తెల్లవారుజామున 5:35 గంటలకు జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అపార్ట్‌మెంట్‌ను తగలెట్టిన మహిళ 

స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. 20 ఏళ్ల యువతి తన అపార్ట్‌మెంట్‌లో కనిపించిన బొద్దింకలను తేలికపాటి మంటతో చంపడానికి ఓ లైటర్‌, ఫ్లేమబుల్ స్ప్రేను ఉపయోగించింది. అదే సమయంలో ఆమె అంటించిన మంటలు తన మంచం, ఇతర చెత్తపైకి వ్యాపించాయి. దీంతో మంటలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. మంటలు చిలికి చిలికి పెద్దగా మారి మొత్తం అపార్ట్‌మెంట్ భవనమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో 30 ఏళ్ల చైనీస్ మహిళ మరణించారు. 

ఈమె తన భర్త, రెండు నెలల వయసున్న చిన్నారితో ప్రమాదం జరిగిన ఐదో అంతస్తు భవనంలోనే ఉంటున్నారు. వీరు ఈ ప్రమాద సమయంలో మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే బయటపడేందుకు ఆ దంపతులు ఇంటిలో నుంచి బయటకు అరుపులు అరిచారు. కేకలు వేశారు. అనంతరం మెట్ల మార్గంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో.. వారు కిటికీ గుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. 

అప్పుడే ఎదురు బ్లాక్ లో ఉన్న ఒక వ్యక్తి గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ముందుగా కిటికీలోకి తమ చిన్నారిని భద్రంగా అందించారు. ఆ తర్వాత భర్త కూడా అందులో నుంచి పక్క బిల్డింగ్ లోకి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే దురదృష్టవశాత్తూ ఆ మహిళ దూకే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ అగ్నిప్రమాదంలో మరో ఎనిమిది మంది నివాసితులు పొగ పీల్చడం (స్మోక్ ఇన్‌హేలేషన్) వల్ల గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, బొద్దింకను చంపడానికి ఈ యువతి గతంలో కూడా ఇలాంటి పద్ధతినే ఉపయోగించినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమెపై 'నిర్లక్ష్యంతో మరణానికి కారణం కావడం' అనే ఆరోపణ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కాగా, ఇలాంటి తాత్కాలిక మంటలను తయారు చేసి బొద్దింకలను చంపే పద్ధతులు సోషల్ మీడియాలో ప్రమాదకరమైన 'లైఫ్ హ్యాక్' ట్రెండ్‌గా మారడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు