Digital arrest: కేంద్ర మంత్రి సంతకంతో.. 99లక్షల కాజేశారు

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఓ నకిలీ అరెస్ట్ వారెంట్‌ను సృష్టించి, మహిళాని రూ. 99 లక్షలు మోసం చేశారు. పుణె కోత్రుడ్‌లో నివసిస్తున్న 62 ఏళ్ల రిటైర్డ్ LIC అధికారిణి ఈ మోసానికి గురయ్యారు.

New Update
Nirmala Sitharaman’s Sign

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త వ్యూహాలతో, ఏకంగా ప్రభుత్వ పెద్దల పేర్లను, వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ అమాయకులను నిండా ముంచుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఒక నకిలీ అరెస్ట్ వారెంట్‌ను సృష్టించి, పుణెకు చెందిన ఓ విశ్రాంత మహిళా అధికారిణిని రూ. 99 లక్షలు మోసం చేశారు. పుణెలోని కోత్రుడ్‌లో నివసిస్తున్న 62 ఏళ్ల రిటైర్డ్ ఎల్‌ఐసీ (LIC) అధికారిణి ఈ మోసానికి గురయ్యారు. అక్టోబర్ చివరి వారంలో ఆమెకు 'డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ' ప్రతినిధిగా చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఆమె ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ అక్రమ లావాదేవీలకు ఉపయోగించబడిందని భయపెట్టాడు.

ఆ తర్వాత, జార్జ్ మాథ్యూ అనే సీనియర్ పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్న మరొక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యిందని, ఆమె బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తామని హెచ్చరించాడు. సైబర్ నేరగాళ్లు ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి జారీ అయినట్లుగా నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం, ప్రభుత్వ ముద్ర ఉన్న నకిలీ అరెస్ట్ వారెంట్‌ను వాట్సాప్‌లో పంపారు.

వయసు దృష్ట్యా ఆమెను 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని, కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వాట్సాప్ కాల్‌లోనే ఉండాలని, ఆమె ఆర్థిక నిధుల ధృవీకరణ నిమిత్తం తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. లేదంటే జైలు శిక్ష తప్పదని బెదిరించడంతో ఆందోళన చెందిన బాధితురాలు, వారు సూచించిన పలు ఖాతాలకు రూ. 99 లక్షలు బదిలీ చేసింది. తరువాత, మోసగాళ్లకు కాల్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి, పుణె సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డబ్బు బదిలీ అయిన ఖాతాలను గుర్తించి, వాటిని బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు