/rtv/media/media_files/2025/09/11/10-naxals-2025-09-11-19-16-52.jpg)
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన గరియాబంధ్ జిల్లాలోని నల్లగడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మావోయిస్టులకు ఒక భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. గరియాబంధ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, ప్రత్యేక దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. కూంబింగ్‌లో భాగంగా భద్రతా దళాలు మావోయిస్టుల స్థావరంపై దాడి చేయగా, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడి అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
10 naxals, including CC member Manoj alias Modem Balkrishna, neutralised by security forces in Gariyaband district of Chhattisgarh: SP Gariaband Nikhil Rakhecha https://t.co/SYwcXBVvi0
— ANI (@ANI) September 11, 2025
ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఘటనాస్థలంలో విస్తృతంగా గాలించారు. ఈ గాలింపు చర్యల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వైర్‌లెస్ సెట్లు, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు కీలక కమాండర్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు, వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోందం బాలకృష్ణ సైతం ఉన్నట్లు సమాచారం. రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు వివరాలను వెల్లడిస్తూ, ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. గరియాబంధ్, దంతెవాడ, బీజాపూర్ వంటి జిల్లాల్లో నిరంతరంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.