BIG BREAKING: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మృతి

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు. ఘటనా స్థలంలో AK 47, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Top woman Naxal leader with Rs 25 lakh bounty killed in Dantewada encounter

Top woman Naxal leader with Rs 25 lakh bounty killed in Dantewada encounter

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా బస్తర్, అబూజ్‌మాడ్ అడవుల్లో తరచూ భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోనినారాయణ్‌పూర్ జిల్లాలో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. అబూజ్‌మాడ్ అడవుల్లో సోమవారం ఉదయం నుంచి జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులు తెలుగువారని, వారిపై భారీ రివార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, మరో మావోయిస్టు కాదరి సత్యనారాయణ అలియాస్ కోస దాదా మరణించినట్లు నారాయణ్‌పూర్ పోలీసులు ధ్రువీకరించారు. వీరిద్దరి స్వస్థలం కరీంనగర్ జిల్లా అని గుర్తించారు. రామచంద్రారెడ్డి వయసు 63 సంవత్సరాలు కాగా, సత్యనారాయణ రెడ్డి వయసు 67 సంవత్సరాలు అని వెల్లడించారు. వీరిద్దరి తలలపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు తెలిపారు.

నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని కచ్చితమైన సమాచారం అందుకున్న డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో అడవుల్లో తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు ఒక ఏకే-47 తుపాకీ, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక గ్రనేడ్ లాంచర్ సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

గత కొద్ది రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరమయ్యాయి. మావోయిస్టులు లొంగిపోవడం లేదా ఏరివేత అనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో పలు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో పలువురు కీలక మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో కూడా పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. ఈ తాజా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు