/rtv/media/media_files/2025/10/24/maharashtra-2025-10-24-15-22-23.jpg)
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. చనిపోవడానికి ముందు ఆమె తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఓ SI తనపై గత ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న ఈ మహిళా డాక్టర్, తనను మానసికంగా, శారీరకంగా ఎస్సై గోపాల్ బద్నే వేధించినట్లుగా తన చేతిపై రాసుకున్న లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె ఆ నోట్‌లో స్పష్టం చేసింది.
ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం సృష్టించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి గోపాల్ బద్నేను ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఆత్మహత్యకు ముందు కూడా ఆ డాక్టర్ డిప్యూటీ ఎస్పీకి లేఖ రాసినట్లు సమాచారం. జూన్ 19వ తేదీన ఫల్టన్‌లో ఉన్న డిప్యూటీ ఎస్పీకి పంపిన ఆ లేఖలో, ఫల్టన్ గ్రామీణ పోలీసు శాఖకు చెందిన ముగ్గురు అధికారులు తనను వేధించినట్లు పేర్కొంది. బద్నేతో పాటు పాటిల్, లద్పుత్రే అనే అధికారుల పేర్లను కూడా ఆమె వెల్లడించింది. తన ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేసింది.
రక్షించాల్సిన పోలీసులే మహిళలను వేధిస్తే న్యాయం ఎలా దొరుకుతుందని ప్రతిపక్షాలు ఈ ఘటనపై మండిపడుతున్నాయి. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Follow Us