/rtv/media/media_files/2025/11/08/kerala-woman-2025-11-08-15-15-20.jpg)
ఆధునిక సమాజంలో కూడా మూఢనమ్మకాలు ఎంత దారుణాలకు పాల్పడుతున్నాయో తెలియజేసే సంఘటన కేరళలోని కొట్టాయం జిల్లాలో వెలుగుచూసింది. ఓ యువతి ఓంట్లో నుంచి "దెయ్యాన్ని పారదోలడం" అనే నెపంతో ఆమెను గంటల తరబడి శారీరక, మానసిక హింసకు గురిచేశారు. బలవంతంగా ఆమెకు మద్యం తాగించి, బీడీ తాగించారని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త, అతని కుటుంబ సభ్యులు కలిసి గత వారం ఓ మాంత్రికుడిని ఇంటికి ఆమెను తీసుకెళ్లారు. చనిపోయిన బంధువుల దుష్టశక్తులు తమ కోడలిని ఆవహించాయని ఆరోపిస్తూ, ఆ దెయ్యాన్ని వదిలించేందుకు మంత్రాలు, క్షుద్రపూజలు చేయించడం మొదలుపెట్టారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ క్షుద్రపూజలు చేసేవారని, ఈ క్రమంలో తాను స్పృహ కోల్పోయానని బాధితురాలు మీడియాకు తెలిపింది.
దెయ్యం వదిలించే క్రమంలో ఆమెకు మద్యం తాగించారు, బలవంతంగా బీడీ తాగించారు. దీంతో పాటు, ఆమెకు విభూతి తినిపించారని, శారీరక హింసకు గురిచేశారని, కాలిన గాయాలు కూడా చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ మానసిక పరిస్థితి విషమించడంతో, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన మాంత్రికుడు శివదాస్ (54), బాధితురాలి భర్త అఖిల్ దాస్ (26), అతని తండ్రి దాస్ (54) లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ కేసులో సహ నిందితురాలైన అఖిల్ దాస్ తల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దెయ్యం, క్షుద్రపూజల పేరుతో ఒక మహిళను ఈ విధంగా హింసించడం కేరళ వంటి అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రంలో చోటుచేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Follow Us