Uttam Kumar Reddy: కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధిస్తుంది

రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని మాజీ పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.

New Update
Uttam Kumar Reddy: కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధిస్తుంది

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించబోతోందని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ 12కు 12 స్థానాల్లో విజయం సాధించి క్లీన్‌ స్వీప్‌ చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలోకి వెళ్లి పని చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాల గురించి వివరించాలని వెల్లడించారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకురాబోయే సంక్షేమ పథకాల గురించి సైతం ప్రజలకు, రైతులకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తమ్‌.. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఎంపీ మండిపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్‌ పాలన వల్ల తెలంగాణలోని ప్రతీ పౌరుడిపై లక్ష రూపాయల అప్పు ఉందన్నారు. రాష్ట్రాన్ని 199 ముక్కలుగా చేసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వాటిని సామ్రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సాండ్‌, ల్యాండ్‌, వైన్స్‌లను బీఆర్‌ఎస్‌ దొంగల ముఠా దోచుకుంటోందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

దళితబంధు కావాలంటే లబ్దిదారులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిదేనని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సైతం లంచాలు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. సొంత పార్టీకి చెందిన కార్యకర్తల నుంచి కూడా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారన్నారు. ఎమ్మెల్యేల చేష్టలతో విసిగిపోయిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. రాష్ట్రానికి పట్టిన శని ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్‌ వెల్లడించారు. కాగా సీఎం కేసీఆర్‌ ఓటమి భయంతోనే రెండు చోట్లా పోటీ చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ప్రజలు రెండు చోట్లా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు.

ALSO READ: కాంగ్రెస్‌ పార్టీ ఫస్ట్‌ లిస్ట్‌ ఫిక్స్‌.. స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితా

Advertisment
తాజా కథనాలు