Ayodhya : జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య(Ayodhya) రామాలయ ప్రారంభోత్సం వేడుకలు అత్యతం వైభవంగా జరగనున్నాయి. జనవరి 22న రాములవారికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. దీంతో పాటూ రాముని జీవిత విశేషాలను తెలియజేసేలా రూపుదిద్దిన 100 విగ్రహాలను కూడా అదే రోజున ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 15 లోపు అన్ని పనులను పూర్తిచేయాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
Also read:పార్లమెంటు సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ కు…కేంద్రం కీలక నిర్ణయం
రామాలయ ప్రారంభానికి దేశంలో ప్రముఖులు, రాజకీయనాయకులందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురిని ఆహ్వానించినట్లు వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. వీరితోపాటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడను ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పలికామన్నారు. అదేవిధంగా త్వరలో మిగిలిన విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. అయితే రామాలయ ప్రారంభోత్సవానికి రాకూడదని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టులో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మూడేళ్ళ తర్వాత ఇప్పుడు రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే ఈ వేడుకకు చాలామందినే ఆహ్వానిస్తున్నారు. దేశవ్యాప్తంగా సాధు సంతులు, స్వామీజీలు, మఠాధిపతులు, పూజారులు, దాతలు, పలువురు రాజకీయ నాయకులతో సహా మొత్తం 6,000 మంది అతిథులకు ఆహ్వానం పంపిస్తున్నారు. మరోవైపు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేయనుంది. జనవరి నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 22న శీరామ విగ్రహ ప్రతిష్టతో పాటూ...ఆ రోజు అనేక ఉత్సవాలు నిర్వహించనున్నారు.