Telangana: అతని వల్లే సంజయ్‌ను తొలగించారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు విజయశాంతి. వీరి ఆటలో జనాలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులే పిచ్చోళ్లయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పంపిన ఓ నాయకుడి వల్లే బండి సంజయ్ పదవి పోయిందని ఆరోపించారామె. బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తున్నందునే ఆ పార్టీని వీడానన్నారు.

Telangana: అతని వల్లే సంజయ్‌ను తొలగించారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..
New Update

Vijayashanti: బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్‌(Congress)లో చేరానని విజయశాంతి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. గతంలో కాంగ్రెస్ విడిచి బీజేపీ(BJP)కి వెళ్ళడానికి కారణం చెప్పారు. అవినీతి పరుడైన కేసీఆర్‌ను జైల్లో వేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిందని, ఆ కారణంగానే బీజేపీలో చేరామన్నారు. నెలలు, సంవత్సరాలు గడిచినా కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మోడీ, అమిత్ షా, నడ్డా.. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ అవినీతిపరుడని, కుటుంబ పాలన చేస్తున్నారని కామెంట్స్ చేశారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు విజయశాంతి.

కేసీఆర్ అవినీతిపై ఆధారాలతో సహా అన్ని వివరాలు వారి దగ్గర ఉన్నాయని, అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు రాములమ్మ. ఏటీఎం, కుటుంబ పాలన, దొంగ అని పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తారు తప్ప చర్యలు మాత్రం శూన్యం అని అన్నారు. ప్రధాని మోదీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉందని, అయినప్పటికీ కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు విజయశాంతి. కేసీఆర్‌పై చర్యలు తీసుకోనందుకే బీజేపీని వీడామన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు విజయశాంతి. తెర ముందు ఒకలా.. తెర వెనుక ఒకలా మత్లాడుతున్నారని విమర్శించారామె. వీరి ఆటలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులు పిచ్చోళ్ళు అయ్యారని అన్నారు. చివరి నిముషం వరకు యాక్షన్ తీసుకుంటారని చూశానని, కానీ అలా జరుగలేదన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు విజయశాంతి.

బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనను ఎందుకు తీసేస్తున్నారని కూడా ప్రశ్నించానన్నారు. ఎన్నికలకు 4 నెలల ముందు అధ్యక్షుడిని మారిస్తే బీజేపీ డిజాస్టర్ అవుతుందని కూడా చెప్పానన్నారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఆయనను తొలగించారన్నారు. బీజేపీలో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటరని, ఆ నాయకుడే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని పదె పదె చెప్పారని ఆరోపించారు విజయశాంతి. ఆయన చెప్పింది నమ్మి.. అధిష్టానం బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిందన్నారు. ఆ వ్యక్తి మీద నమోదైన అసైన్డ్ భూముల కేసు ఏమైందని ప్రశ్నించారు విజయశాంతి. పరోక్షంగా ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి ఆమె ఈ కామెంట్స్ చేశారు.

బీజేపీ చేజేతులా వారి పార్టీని వారే నాశనం చేసుకున్నారని అన్నారు విజయశాంతి. బీఆర్ఎస్, బీజేపీలు తెర ముందు ఒకలా తెర వెనుక ఒకలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారామె. రెండు పార్టీల మధ్య వైరమే ఉంటే.. కాళేశ్వరం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారామె. మెడిగడ్డ పిల్లర్లు కుంగినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఒప్పందం ప్రకారమే చేసారా? అని ప్రశ్నించారు. తనను తిట్టే హక్కు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు. తాను డబ్బు కోసం, పదవుల కోసం తలొగ్గని అన్నారు. తన గురువు అద్వానీ నుంచి విలువైన రాజకీయాలు నేర్చుకున్నానన్న విజయశాంతి.. ఇప్పటి బీజేపీ నేతలుకు ఇప్పుడు అలాంటి విలువలు లేవన్నారు. కొంతమంది లీడర్లు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపించాలని పిలుపునిచ్చారు విజయశాంతి. బీజేపీ తనను మోసం చేసింది తప్ప.. తాను ఎవరినీ మోసం చేయలేదని అన్నారామె.

Also Read:

ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..

రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!

#vijayashanti #telangana-politics #telangana-news #telangana-elections-2023 #telangana-elections-updates #telugu-news #telugu-latest-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe