ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయనకే ఛాన్స్.... !

విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు.

author-image
By G Ramu
New Update
Mallikarjun Kharge:  కలబురగిలో ఖర్గే ఎమోషనల్.. తన అంత్యక్రియలకు రావాలంటూ!

విపక్ష ‘ఇండియా’కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముంబైలో జరిగే విపక్ష కూటమి మూడవ సమావేశంలో కన్వీనర్ గా మల్లిఖార్జున ఖర్గే పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖర్గే అత్యంత సీనియర్ నేత కావడంతో ఆ పదవికి ఆయన పేరును ప్రతిపాదించాలని పలు పార్టీల నేతలు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

విపక్ష కూటమి కన్వీనర్ పదవిని జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆశిస్తున్నారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. ఇండియా కూటమికి ఆయన్నే కన్వీనర్ గా నియమించాలని శివసేన(యూబీటీ), ఇతర పార్టీల నేతలు ప్రతిపాదనలు చేశారు. కానీ తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని ఆయన ఇటీవల ప్రకటించారు. తాను మొదటి నుంచి ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని అన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏక తాటిపైకి తేవడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. దీంతో కన్వీనర్ పదవి బరి నుంచి ఆయన తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జేడీయూ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే లేదా మరో నేతను ఇండియా కూటమికి కన్వీనర్ గా ఎన్నుకోవాలని జేడీయూ నేతలు సూచించారు.

విపక్ష కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు. దీంతో పాటు 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఇక కూటమి లోగోను ఈ సమావేశంలో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రతిపక్షాలను ఒకే తాటి పైకి తీసుకు రావడంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతోనే మొదటి సమావేశాన్ని బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. ఈ సమావేశంలో విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో జూలై 17-18 తేదీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే విపక్ష కూటమికి ఇండియా అనే పేరు ఖరారు చేశారు.

ALSO READ: విపక్ష కూటమి కన్వీనర్ పోస్టుపై….. నితీశ్ కుమార్ ఏమన్నారంటే….!

Advertisment
Advertisment
తాజా కథనాలు