Khammam MP Ticket : పార్లమెంటు ఎన్నిక(Parliament Elections) లకు అన్ని పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తోంది. కాంగ్రెస్(Congress) కూడా కొంత మంది పేర్లను ఖరారు చేసేసింది. కానీ ఖమ్మం(Khammam) పార్లమెంటు అభ్యర్ధి ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇక్కడ సీటు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చేతులెత్తేయడంతో... విషయం ఢిల్లీ పెద్దల చేతికి వెళ్ళింది. ఖమ్మం సీటు కోసం భట్టి భార్య ప్రయత్నిస్తున్నారు. అలాగే పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి కుటుంబ సభ్యులకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం మీదన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర క్యాబినెట్లో హోదాను అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ ఇవ్వడమేంటని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భట్టి భార్యకు టికెట్ ఇవ్వకుండా పొంగులేటి గట్టి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
రామసహాయం రఘురామిరెడ్డి తెర మీదకు...
ఈ నేపథ్యంలో మరో కొత్త అభ్యర్ధి పేరు తెర మీదకు వచ్చింది. ఈ సీటు కోసం సీనియర్ నేతలు ముగ్గురూ ప్రయత్నాలు చేస్తుండడంతో.. ఎవరికి ఇచ్చినా మరో ఇద్దరు అలిగే ఛాన్స్ ఉండడంతో మధ్యే మార్గంగా మరో కొత్త పేరును తెర మీదకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ ఆర్.సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీని వెనుక కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. పొంగులేటి మొదట తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో రఘురామిరెడ్డి పేరు తెర మీదకు తీసుకువచ్చారు. ఈయన పొంగులేటికి వియ్యంకుడు. వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో.. పొంగులేటి, రామసహాయం కుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాలేరు నుంచి రఘురామిరెడ్డి పోటీకి దిగుతారని ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు సాగుతున్నాయని వినిపిస్తోంది. భట్టి భార్య నందినికి చెక్ పెట్టేందుకు పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది.
ఇక ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో సీఈసీ, స్క్రీనింగ్ కమిటీ మధ్య ఏకాభిప్రాయం కుదిరితే.. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read : Heart Attack : గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే!