Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (National Dam Safety Authority) ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. అలాగే ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also read: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే?
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ (Medigadda) కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ రాష్ట్ర సర్కార్‌కు మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న కీలక అంశాలు, సిఫార్సులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ నివేదకలో స్పష్టం చేసిందని తెలిపారు.
అయితే మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై కేబినేట్ మీటింగ్‌లో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈసీ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల శనివారం జరగాల్సిన కేబినేట్ భేటీ వాయిదా పడటంతో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని సీఎం అన్నారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం లోపు ఈసీ కేబినెట్ మీటింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోతే.. మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి సీఈసీని అనుమతి కోరుతామని చెప్పారు.
Also read: రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు: డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ