Indiramma Housing Scheme: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం రేపు ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎంతో పాటు ఆరుగురు సహచర మంత్రులు కూడా యాద్రాద్రికి వెళ్లనున్నారు. నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజు పూజలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గోననున్నారు. యాదాద్రి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాచలం వెళ్తారు.
ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్!
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం సీఎం భద్రాచలం సీతారాములను దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలం మార్కెట్ యార్డ్ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నిప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో కలిసి చర్చించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మణుగూరు ప్రజాదీవెన సభలో రేవంత్ పాల్గొంటారు. ఈ సభలో ప్రసగించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు హెలికాఫ్టర్ లో బేగంపేటకు చేరుకుంటారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం..
ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభిస్తారు. ఈ పథకం విధివిధానాలు, నిబంధనలను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. . ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకాన్ని మొదటగా నియోజకవర్గానికి 3,500 మంది అర్హులను ఎంపిక చేసి ఈ డబ్బు సాయాన్ని అందించనున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ మూడు నమూనాలను కూడా రెడీ చేసింది.
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు..
తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. ఈ నెల 12న ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం వల్ల మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని అన్నారు. మహిళలను మహాలక్ష్మిలుగా చేయడమే తమ ప్రభుత్వం ఎజెండా అని అన్నారు.