వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సహకారంతో చేపట్టిన ఈ సర్వేలో దారుణమైన విషయాలు బయట పడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదు నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న విద్యార్థుల్లో సుమారు 62,754 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 10,545 మంది విద్యార్థులు మరణించడగా.. అనంతపురంలో 4165, గుంటూరు జిల్లాలో 6422 మంది విద్యార్థులు మరణించినట్లు జనసేన నేత స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానంటున్న జగన్.. ఈ సర్వే రిపోర్ట్‌పై సమాధానం ఎందుకు చెప్పలేక పోతున్నారన్నారు. దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్న ఆయన.. సర్వే రిపోర్టుపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలను సైతం సీఎం వెల్లడించాలన్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల 82 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ అయినట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. మరోవైపు 2 లక్షల 29 వేల మంది విద్యార్థుల గురించి సమాచారం లేదన్నారు. విద్యార్థులు మిస్ అయినట్లు సర్వు రిపోర్ట్‌లో వచ్చిందని వెల్లడించారు. వీరంతా ఏమైనట్లో సీఎం చెప్పాలన్నారు.
మరోవైపు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతికి అడ్డూ అదుపూలేకుండా పోతోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ నేతల రౌడీయిజం ఎక్కువైందన్న ఆయన.. వైసీపీ నేతలు రైతుల భూములను లాక్కొని వారిని రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సామాన్య ప్రజలకు ఇసుక అందకుండా పోయిందని, ఇసుక లభించకవడంతో సామాన్యులు ఎలాంటి నిర్మాణాలు చేసుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.