Allu Arjun - Revanth Reddy: అల్లు అర్జున్‌కు CM రేవంత్ మరో బిగ్ షాక్.. ఇల్లు కూల్చేయనున్న అధికారులు

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45లోని అల్లు బిజినెస్‌ పార్కు నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. అనుమతి ఉన్న దానికంటే అదనంగా పెంట్‌హౌస్‌ నిర్మించారని, ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

New Update
telangana cm revanth reddy Big Shock To Allu Arjun

telangana cm revanth reddy Big Shock To Allu Arjun

అల్లు అర్జున్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య గతంలో ‘పుష్ప 2’ సినిమా విషయంలో కొన్ని వివాదాస్పద వార్తలు వచ్చాయి. ప్రధానంగా ఒక థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన ఈ వివాదానికి కారణమైంది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా.. ఆమె కుమారుడు గాయపడటంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అల్లు అర్జున్ అసలు మనిషేనా?.. ఆయనకు కన్ను పోయిందా?.. కాలు పోయిందా?.. ఎందుకు అతన్ని అంతలా పరామర్శిస్తున్నారు’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అల్లు అర్జున్‌కు రేవంత్ సర్కార్ షాక్

సినిమా ప్రమోషన్ల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు కూడా చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వైపు వివరణ ఇచ్చారు. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమని, తాను ఎవరినీ బాధపెట్టాలని చూడలేదని, అది ఒక ప్రమాదం అని తెలిపారు. తాను ఎల్లప్పుడూ అభిమానుల క్షేమాన్ని కోరుకుంటానని, జరిగిన సంఘటనకు బాధపడినట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ సమస్య పరిష్కారమైంది. 

ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం లభించింది. ‘పుష్ప 2’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అయింది. కానీ అదే వేదికపై అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాలోని డైలాగ్ చెప్పడం మరించ చర్చనీయాంశమైంది. ‘‘ఆ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్లు ఒక్కొక్కడి తలలు రప్పా రప్పా నరుకుతా’’ అంటూ చెప్పిన డైలాగ్ సంచలనం సృష్టించింది. దీంతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్‌గానే అల్లు అర్జున్ ఆ డైలాగ్ చెప్పాడంటూ చాలా మంది ఆ వీడియోను వైరల్ చేశారు. 

అది జరిగిన తర్వాత అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు తొలగిపోయాయని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. అల్లు అరవింద్‌కు GHMC అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇప్పుడిది మరింత చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ‘అల్లు బిజినెస్ పార్క్’  పేరుతో ఒక భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని దాదాపు 4 అంతస్తుల వరకు నిర్మించుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకుంది. అక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ 4 అంతస్తుల బిల్డింగ్‌పై అదనంగా ఒక పెంట్‌హౌస్ నిర్మించారు. అది కాస్త GHMC అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ‘అల్లు బిజినెస్‌ పార్కు’ అనుమతి పొందిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టిందని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తనిఖీలు చేసి, అక్రమ నిర్మాణాన్ని ధృవీకరించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అల్లు అరవింద్‌కు షోకాజ్‌నోటీసులు పంపారు. 

Advertisment
తాజా కథనాలు