మహారాష్ట్ర మాజీ మంత్రి, సల్మాన్ ఖాన్ ఫ్రెండ్.. బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సిద్ధిఖీని హత్య చేసింది తామే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలోనే అనేక సార్లు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించింది. ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కూడా జరిపారు. అయితే సల్మాన్ ఖాన్ స్నేహితుడు సిద్ధిఖీకి మాత్రం ఎలాంటి బెదిరింపులు లేవు.
ఇది కూడా చదవండి: సిద్ధిఖీ మరణానికి కారణం మేమే.. వైరల్ అవుతున్న బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్
కానీ తమ టార్గెట్‌గా ఉన్న సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండడమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇటీవలే లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోదారా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ స్నేహితుడు తమ శత్రువు అన్నారు. రోహిత్ నుంచి స్టేట్‌మెంట్ ఇలా వచ్చిందో లేదో సిద్దిఖీని దారుణంగా చంపేశారు. తనకు ప్రాణహాని ఉందని, వై కేటగిరీ భద్రత కేటాయించాలని పోలీసు ఉన్నతాధికారులను 15 రోజుల క్రితమే సిద్ధిఖీ కోరినట్లు తెలిసింది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.
నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానే
సిద్దిఖీ మాటకు బాలీవుడ్‌లో విలువ ఇస్తారు. సెలబ్రెటీలకు పార్టీలు ఇవ్వడంలో ఈయనకు పెట్టింది పేరు. గతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కి మధ్య విభేదాలు ఉండటంతో వీరిద్దరిని సిద్ధిఖే కలిపారు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీకి మంచి స్నేహం ఉంది. సిద్ధిఖీ హత్యతో ఇక బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానేనని చర్చ నడుస్తోంది.
1998లో కృష్ణ జింకలను వెంటాడినట్టు సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. బిష్ణోయ్ తెగకు ఈ కృష్ణ జింకలు అత్యంత పవిత్రమైనవి. అందుకే గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ వంటి క్రిమినల్స్.. సల్మాన్‌పై పగబట్టారు. ఈ ఇద్దరు క్రిమినల్స్ కొంతకాలంగా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరిస్తూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: స్లమ్ ప్రాజెక్టే సిద్ధిఖీ హత్యకు కారణమా? అసలేంటి ఈ ప్రాజెక్ట్?
ఇందులో భాగంగానే ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో కాల్పులు జరిపారు. ఆ మధ్య ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. కాగా హత్యకేసులో బిష్ణోయ్ ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉండగా.. గోల్డీ బ్రార్ కెనడాలో ఉన్నాడు.