/rtv/media/media_files/2025/07/18/kollywood-director-and-actor-velu-prabhakaran-passes-away-2025-07-18-10-56-32.jpg)
kollywood director and actor Velu Prabhakaran passes away
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత రెండు రోజుల్లో టాలీవుడ్‌లో ఇద్దరు మృతి చెందారు. కోట శ్రీనివాస రావు, సరోజినీ దేవి ప్రాణాలు కోల్పోవడం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. తమిళ సినీ పరిశ్రమలో తనదైన శైలితో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు, నటుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు (గురువారం) 68 సంవత్సరాల వయసులో చెన్నైలో కన్నుమూశారు. ఆయన మరణం కోలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.
అంత్యక్రియలు
ఆయన భౌతికకాయాన్ని ఈరోజు సాయంత్రం నుండి రేపు (జూలై 19) మధ్యాహ్నం వరకు చెన్నైలోని వలసరవాక్కంలోని ఆయన నివాసంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆదివారం (జూలై 20) సాయంత్రం పోరూరు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సినీ ప్రస్థానం
వేలు ప్రభాకరన్ 1989లో ‘నలయ మణితన్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కడవల్’ (1997) సినిమా అద్భుతమైన విజయం అందుకుని ప్రశంసలు పొందింది. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే ‘కాదల్ కథై’ (2009) వంటి చిత్రాలతో కులం, లైంగికత వంటి సున్నితమైన విషయాలను చర్చించి సంచలనం సృష్టించారు. దర్శకుడిగానే కాకుండా ప్రభాకరన్ కొన్ని చిత్రాలలో నటుడిగా కూడా మెప్పించారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్’ (2019), ‘కాడవర్’ (2022) చిత్రాల్లో ఆయన నటనకు మంచి రెస్పాన్స్ లభించింది.