Maharashtra : మహారాష్ట్ర కీలక రాజకీయ నేత బాబా సిద్దిఖీ దారుణ హత్య ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై బాంద్రాలోని ఆయన కుమారుడు జీషాన్ కార్యాలయం ముందు ఉన్న ఆయన్ని శనివారం రాత్రి ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలతో ఉన్న బాబా సిద్దిఖీని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయన వయస్సు 66. ఈ బాబా సిద్ధిఖీ ఒక రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు బాలీవుడ్ 'మధ్యవర్తిగా' మంచి గుర్తింపు కూడా ఉంది. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల మధ్య నెలకొన్న ‘కోల్డ్ వార్’ని బాబా సిద్ధిఖీ ముగించిన విధానం గురించి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటారు.
వారిద్దరిని కలిపిన బాబా సిద్దిఖీ..
హిందీ చిత్రసీమలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య కోల్డ్ వారు నడుస్తుంది. ఒకప్పుడు సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ బర్త్ డే సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయి ఇద్దరు బడా స్టార్ల మధ్య ఈ పవర్ ఫైట్ గురించి నిర్మాతలు ఆందోళన చెందారు.
బాబా సిద్ధిఖీకి ఈ విషయం గురించి సమాచారం అందింది. ఆయన మద్దతు కావాలని కొందరు సినీ ప్రముఖులు ఆయన వద్దకు వచ్చారు. సినిమాకి పెద్దగా సంబంధం లేని ఈ వ్యక్తి, కోల్డ్ వార్ కి ముగింపు పలకడమే కాకుండా, ఇద్దరు ఖాన్‌లను మళ్లీ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా చేసేశారు.
ఎలా కలిపారంటే..!
బాబా సిద్ధిఖీ బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 2013లో ఉన్నారు. ప్రతి ఈద్‌కు ఆయన ఇచ్చే ఇఫ్తార్ విందులు దక్షిణ ముంబై సోషల్ సర్కిల్లో చాలా ప్రత్యేకంగా ఉండేవి. సల్మాన్, షారుఖ్‌ల మధ్య విభేదాలు తొలగించేందుకు బాధ్యత వహించాలని సిద్ధిఖీని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కోరాయి.
దాంతో ఆయన ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ మార్గాన్ని కూడా ఆలోచించారు. ఆయన ఏర్పాటు చేసిన ఈద్ విందులో సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ పక్కన షారుఖ్‌ను సిద్దిఖీ స్వయంగా కూర్చోబెట్టారు. సల్మాన్ వారి టేబుల్ దగ్గరికి వచ్చే ముందు షారుఖ్ సలీం ఖాన్‌తో కాసేపు మాట్లాడిన వీడియో అప్పట్లో చాలా వైరల్‌గా మారింది. షారుఖ్ లేచిన తర్వాత ఇద్దరు స్టార్స్ ఒకరినొకరు కౌగిలించుకుని పలకరించుకున్నారు.
అప్పుడు బాబా సిద్ధిఖీ వారితో చేరి ఫోటోగ్రాఫర్లను సరదాగా ఫొటో తీయమని అడిగారు. అలా సిద్ధిఖీ ఆ ఇద్దరి స్టార్స్ మధ్య కోల్డ్ వార్ని ఆపేశారు.
ఈ ఏడాది మార్చ్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్)లో చేరే వరకు 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాబా సిద్ధిఖీ.. 2013 వరకు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.విజయ దశమి రోజున తన కుమారుడు జీషాన్ కార్యాలయం దగ్గర బాణసంచా పేల్చుతుండగా బాబా సిద్ధిఖీపై దాడి జరిగింది. మీడియా కథనాల ప్రకారం రాత్రి 9.15 నుంచి 9.20 గంటల మధ్య ఈ దారుణ ఘటన జరిగింది.
Also Read: శరీరంలో ఆరు బుల్లెట్లు.. NCP కీలక నేత దారుణ హత్య!