టాలీవుడ్ Vs రేవంత్.. ఇంతటితో ఆపకపోతే తాట తీస్తాం!

నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్‌ పెద్దలు భగ్గుమంటున్నారు. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అంతా ఏకమై సమంత, నాగార్జున ఫ్యామిలీకి అండగా ఉన్నారు. 'ఇండస్ట్రీ జోలికి రావద్దు..' అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

New Update

సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకే తాటిపైకి వచ్చింది.. కేటీఆర్‌ వర్సెస్‌ కొండాసురేఖ ఎపిసోడ్‌ దీనికి కారణమైంది. తన రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్‌పై కామెంట్స్‌ చేసే క్రమంలో కొండాసురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్‌ పెద్దలు భగ్గుమంటున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి బడా హీరోలు సైతం కొండాసురేఖపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. చాలా మంది రియాక్ట్ అవుతున్న తీరును గమనిస్తే అందరూ ఒకటే మాట చెబుతున్నారు. 'ఇండస్ట్రీ జోలికి రావద్దు..' ఇదే అందరి రియాక్షన్స్‌లో మోస్ట్ కామన్‌పాయింట్!

అప్పుడు అంతా సైలెంట్..

నిజానికి రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. డగ్స్‌ తీసుకుంటే ఎవరినైనా వదిలేది లేదంటూ ఖరాఖండిగా చెప్పారు. ఇక ఆ తర్వాత హైడ్రా విషయంలో రేవంత్‌ తీసుకున్న నిర్ణయం నాడు టాలీవుడ్‌లోనూ పెను ప్రకంపనలకు కారణమైంది. టాలీవుడ్‌ మెయిన్‌ పిల్లర్స్‌లో ఒకరైన నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెషన్‌ను కూల్చడమే దీనికి ప్రధాన కారణం. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. అంతా మౌనమే పాటించారు.

టాలీవుడ్ పై రేవంత్ ఫైర్..

'సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం' రేవంత్‌ రెడ్డి స్వయంగా గత జులైలో ఈ కామెంట్స్ చేశారు. నంది అవార్డులకు గద్దర్‌ పేరు పెట్టడం టాలీవుడ్‌కు నచ్చలేదు కావొచ్చు.  ఒక్క మోహన్‌ బాబు మినహా ఏ నటీనటులు, దర్శక నిర్మాతలు ఎవరూ కూడా గద్దర్‌ అవార్డులను స్వాగతించినట్టు అనిపించలేదు. అందుకే రేవంత్‌ ఓపెన్‌గా టాలీవుడ్‌ పెద్దలపై మండిపడ్డారు.

టాలీవుడ్‌ అంతా ఒకటే మాట

ఇలా రేవంత్‌ వర్సెస్‌ టాలీవుడ్‌ వార్‌ నడుస్తోన్న సమయంలో కొండాసురేఖ ఎపిసోడ్‌ ముదిరింది. ఇందులో సీఎం కార్నర్‌ అయ్యినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్‌ అంతా ఒకటే మాట మాట్లాడుతోంది. ఇండస్ట్రీ జోలికి రావద్దని హెచ్చరిస్తోంది. నిజానికి కొండాసురేఖ చేసిన కామెంట్స్‌ అక్కినేని కుటుంబాన్ని, సమంతను డీఫేమ్ చేసేలా ఉన్నాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం. కొండాసురేఖ సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. నాగచైతన్య, సమంతను ఈ విషయంలో లాగడమే తప్పేనన్నట్టుగా ఒప్పుకున్నారు. కానీ సినీ పెద్దలు మాత్రం ట్వీట్ల దండకాన్ని ఆపలేదు. ఒకరి తర్వాత ఒకరు కొండాసురేఖపై విరుచుకుపడుతూనే ఉన్నారు. అయితే కేవలం సమంత-నాగచైతన్య విషయాన్ని ప్రస్థావించకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపేసి మాట్లాడుతుండడం చర్చకు దారి తీసింది.

'వ్యక్తిగత జీవితాలను బయట పెట్టడం, దిగజారడం రాజకీయాలకు పరాకాష్ట.. పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు సమాజంలో హూందాగా, గౌరవంగా ఉంటూ గోప్యత పాటించేలా ఉండాలి.. ఇలా చిత్ర పరిశ్రమపై నిరాధార మాటలు అనడం సరికాదు. నిజంగా ఇది బాధాకరమైన ఘటన.. ఇతరులు సినీ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేస్తే.. చూస్తూ కూర్చొనేది లేదు..' ఇది జూనియర్ ఎన్టీఆర్‌ చేసిన ట్వీట్‌కు సారాంశం. 

అటు చిరంజీవి సైతం ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. 'సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు.. మా సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి మాటలను అందరం కలిసి వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం, ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు..' చిరు చేసిన ఈ ట్వీట్‌ను గమనించినా ఇండస్ట్రీ మొత్తం ఒకే తాటిపైకి వచ్చి రేవంత్‌ సర్కార్‌పై పెద్ద సైజు యుద్ధాన్నే ప్రకటించినట్టు అర్థం చేసుకోవచ్చు.

#ktr #cm-revanth-reddy #chiranjeevi #konda-surekha #akkineni-nagarjuna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe