/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/chiru-2-jpg.webp)
Megastar Chiranjeevi Video On Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు(Elections) మరో ఆరు రోజుల సమయమే ఉంది. దీంతో పార్టీలన్ని కూడా ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా మండే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారాలు నిర్వహించుకుంటున్నాయి. ఈ సారి ఎలాగైనా ఫ్యాన్ గాలిని ఆపాలని మిగిలిన పార్టీలన్ని కష్టపడుతున్నాయి. ఈ సారి ఏపీలో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) లు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
ఈ క్రమంలో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. జనసేనానిని గెలిపించాలని చిరంజీవి కోరారు. "కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్... తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం... ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది.
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024
సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.
ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయాలో మీరు చూడాలంటే... పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలి. సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించండి. జైహింద్" అని చిరంజీవి తన సందేశాన్ని ఇచ్చారు.
Also read: ప్లీజ్ మాల్దీవులకు రండి..భారతీయులను కోరిన ఆ దేశ మంత్రి