నటుడు చంద్రమోహన్ భార్య జలంధర సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోయినా ఒక రచయితగా సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 100కు పైగా కథలు, పలు నవలలు రాసిన ఆమె సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఈ భార్యభర్తలిద్దరూ తమతమ రంగాలలో ఒకరికి ఒకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ఆదర్శ దంపతులుగానూ అవార్డు అందుకోవడం విశేషం.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ బంధం గురించి మాట్లాడిన జలంధర.. చంద్రమోహన్ సినిమాలన్నీ తనకు బాగా నచ్చుతాయని చెప్పారు. ‘ఆయన హస్తవాసి నాకు బాగా కలిసి వచ్చింది. ఆయన చేతితో నాకు డబ్బులు ఇవ్వడం వల్లే మంచి స్టార్ రైటర్ పేరు దక్కింది’ అని తెలిపారు. అలాగే చంద్రమోహన్ చేతితో పైసలు తీసుకుంటే తమకు మేలు జరుగుతుందని చాలామంది నమ్ముతారని, అందుకే ప్రతీ సంవత్సరం జనవరి 1న ఎంతోమంది తమ ఇంటికి వచ్చి ఆయన చేతుల మీదుగా కనీసం ఒక్క రూపాయి అయినా తీసుకోవడం సెంటిమెంట్‌గా మారిందని తెలిపారు.
Also read : ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్‌ది చెరగని ముద్ర.. కేసీఆర్, చిరంజీవితో పాటు ప్రముఖలు ఏమన్నారంటే?
ఇక చంద్రమోహన్ సైతం తన భార్య వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పేవారు. పని ఒత్తిడిలోనూ తాను కోపంలో అరిస్తే చాలా ఓపికగా భరించేదని, ఆమెకు చాలా సహనం ఉందన్నారు. నిజంగా తన కోపాన్ని తగ్గించడానికే దేవుడు ఆమెకు ఇంత సహనం ఇచ్చాడేమో అనిపిస్తుందని పలు ఇంటర్వ్యూల్లోనూ జలంధర క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపించేవారు. అయితే 175 సినిమాల్లో హీరోగా, మొత్తంగా 900కుపైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ తన వారసులను సినీ పరిశ్రమకు పరిచయం చేయకపోవడంపై కారణాలు కూడా వెల్లడించారు. పిల్లలపై సినిమా ప్రభావం పడకుండా పెంచామని, వాళ్లను చిన్నప్పుడు చూసిన నటి భానుమతి.. ‘ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. బాల నటులుగా పరియం చేద్దాం’ అని తనని అడిగారని గుర్తు చేశారు. కానీ తాను తిరస్కరించినట్లు చెప్పారు. వారిద్దరూ చదువుల్లో రానించగా గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. ప్రస్తుతం పెద్దకూతురు మీనాక్షి సైకాలజిస్ట్ హోదాలో ఉండగా వివాహం తర్వాత ఆమె కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు. ఇక రెండో కూతురు మాధవి వృతిరీత్యా డాక్టర్. ఆమె కూడా మ్యారేజ్ తర్వాత భర్త, పిల్లలతో కలిసి చెన్నైలో ఉంటున్నారు.