స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు భవితవ్యం నేడు తేలిపోనుంది. సెక్షన్ 17ఏ ప్రకారం తన మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తికానందున నేటి మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గీ తన వాదనలను కొనసాగిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ముకుల్‌రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. అవి ముగిసిన తర్వాత ధర్మాసనం ఈరోజే తీర్పు చెబుతుందా..లేక తీర్పును రిజర్వ్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. వాదనలు ముగిసే సమయం, కోర్టు సెషన్స్ ఎండ్ టైమ్ లాంటి వాటి మీద ఆధారంగా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంటుంది.
Also Read:ఖాతా తెరిచిన ఆస్ట్రేలియా-శ్రీలంక మీద విజయం
హైకోర్టులో తాను దాఖలుచేసిన క్వాష్‌పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తోంది. స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత, ధర్మాసనం ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కేసును విచారించనుంది.
మరోవైపు నిన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై (Chandrababu Health) ఏసీబీ కోర్టులో (ACB Court) ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.