/rtv/media/media_files/2025/10/17/tie-2025-10-17-20-29-14.jpg)
హైదరాబాద్‌లో పారిశ్రామిక రంగానికి, స్టార్టప్‌ల వ్యవస్థని ప్రోత్సహించేందుకు 'ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్' హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ సదస్సు అక్టోబర్ 31, నవంబర్ 1 రెండు రోజుల పాటు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థాపక సంఘంగా పేరుగాంచిన 'టీఐఈ గ్లోబల్' లో భాగమైన టీఐఈ హైదరాబాద్, ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ సదస్సుకు దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న వెంచర్ క్యాపిటల్ (VC) సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ సహా 25కి పైగా పెట్టుబడి సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. దాదాపు 1,500 మందికి పైగా వ్యవస్థాపకులు, పారిశ్రామిక ప్రముఖులు, విధాన నిర్ణేతలు, 500కు పైగా స్టార్టప్ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది.
ఏఐ & డీప్ టెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, తయారీ, డిఫెన్స్ & ఏరోస్పేస్ వంటి 20కి పైగా కీలక రంగాలపై చర్చలు జరుగుతాయి. ఈ సందర్భంగా వ్యవస్థాపకతలో విశేష కృషి చేసిన వారిని 'TiE ఎక్సలెన్స్ అవార్డులు', తెలంగాణలోని 50 అత్యంత ఆశాజనకమైన స్టార్టప్‌లకు 'TiE 50 అవార్డులు' ప్రదానం చేయనున్నారు.
ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్‌లు నిధులు సమీకరించుకోవడానికి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి మరియు కీలక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుందని టీఐఈ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజేశ్ పగడాల తెలిపారు. గత ఏడాది హైదరాబాద్ స్టార్టప్‌లకు నిధుల సేకరణలో 160% వృద్ధి నమోదై, $571 మిలియన్లకు చేరిన నేపథ్యంలో ఈ సదస్సు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.