Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

New Update
Rupee breaches the 90-mark

Rupee breaches the 90-mark

''రూపాయి విలువ పడిపోతోంది'' ఈ మాటను మనం తరచుగా వింటుంటాం. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయినప్పుడల్లా దేశ ప్రజలపై ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న సమస్యలు, ఇతర కారణాల వల్ల మన రూపాయి విలువ రోజురోజుకు పడిపోతుంది. బుధవారం ఏకంగా డాలర్‌తో పోలిస్తే రూ.90 మార్క్‌ దాటింది. దేశ చరిత్రలో ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. శుక్రవారం నాటికి రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే.. రూ.89.95గా ఉంది. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది ?. ఇలా జరిగినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

విదేశీ పెట్టుబడుల తరలింపు

అమెరికాలో కూడా ప్రస్తుతం ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. దీన్ని నియంత్రించేందుకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్‌ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచింది.  దీంతో అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు లాభదాయకంగా, సురక్షితంగా మారింది. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీ మొత్తంలో వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి  నుంచి డిసెంబర్ 2వ తేదీ నాటికి 17 బిలియన్ డాలర్లు (రూ.1.5 లక్షల కోట్లు) విలువ చేసే షేర్లు అమ్మేసి వాటిని డాలర్లోకి మార్చుకున్నారు. ఈ సంపదను అంతా తమ దేశాలకు తరలించేశారు. ఇది రూపాయిపై ఒత్తిడిని తీవ్రంగా పెంచింది. 

టారిఫ్‌ ఎఫెక్ట్

ఇటీవల ట్రంప్‌ భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనివల్ల అమెరికాకు ఎగుమతి అయ్యే దేశీయ వస్తువులు అక్కడ ఖరీదుగా మారడంతో వాటికి డిమాండ్‌ తగ్గుతోంది. ఫలితంగా అమెరికాకు మన ఎగుమతులు తగ్గడంతో భారత్‌కు వచ్చే డాలర్లు ప్రవాహం తగ్గిపోయింది. దీని ప్రభావంతో విదేశీ మారక నిల్వలు తగ్గి డాలర్ల కొరత ఏర్పడింది. క్రమంగా రూపాయి బలహీనపడుతూ వస్తోంది. 

పెరిగిన చమురు ధరలు

భారత్‌ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రస్తుతం ముడి చమురు ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిపోయాయి. దీనివల్ల భారత్‌.. గతంలో కంటే ఎక్కువ డాలర్లు పెట్టి ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. మన దేశానికి 85 శాతం చమురు విదేశాల నుంచే వస్తోంది. ప్రతీ సంవత్సరం 170 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. 2022-23లో అప్పటి రూపాయి విలువ రూ.82.60 ప్రకారం ముడి చమురు కోసం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 

ఇప్పుడు అదే స్థాయిలో దిగుమతి చేసుకోవాలంటే అదనంగా మరో 2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది.చమురుతో పాటు ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెల కోసం కూడా మనం విదేశీ సరఫరాదారులపైనే ఆధారపడున్నాం. మొత్తంగా చూసుకుంటే మన ఎగుమతులు తక్కువగా ఉంటే.. దిగుమతి చేసుకునేవి ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల భారత్‌ నుంచి అధిక మొత్తంలో డాలర్లు బయటికి వెళ్లిపోవడంతో రూపాయి బలహీనపడుతూ వస్తోంది. 

క్షీణిస్తున్న రూపాయి విలువ

1947లో భారత్‌కు స్వాతంత్యం వచ్చినప్పుడు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. 1991లో రూ.22.74, 2000లో రూ.44.94, 2018లో రూ.70.09, 2022లో రూ.81.35గా ఉంది. 2025 చివరినాటికి దాదాపు రూ.90కి చేరింది. రూపాయి విలువ ఇలా క్రమంగా క్షీణిస్తుండటంతో ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

రూపాయి విలువ తగ్గితే ప్రభావం

రూపాయి విలువ తగ్గిపోయినప్పుడు విదేశాల నుంచి దిగుమతి అయ్యే చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం, మెడికల్ పరికరాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. వీటి ప్రభావంతో పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దేశంలోకి వచ్చే దిగుమతులు పెరగడంతో సాధారణ ప్రజలు కొనే అన్ని రకాల వస్తువులు పెరిగిపోతాయి. అంతేకాదు విదేశాలకు వెళ్లేవారి ఖర్చులు అధికమవుతాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఇది భారంగా మారుతుంది. రూపాయి పడిపోయినప్పుడు దేశీయ సంస్థలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపులు పెరిగి ఆర్థిక భారంగా మారుతుంది. 

రూపాయి బలపడాలంటే 

రూపాయి బలపడాలంటే దేశాభివృద్ధికి దోహదపడే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. విదేశీ కంపెనీలు దేశంలో నేరుగా తమ వ్యాపారాలు, సంస్థలు స్థాపించుకునేందుకు విధానాలను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు పెరిగి దేశానికి డాలర్లను తీసుకొస్తాయి. అలాగే విదేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. దీనివల్లే ప్రధానంగా రూపాయి విలువ పడిపోతోంది. ఇందుకోసం  చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చి ఉత్పత్తులను పెంచాలి. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే విద్య, వైద్యంతో పాటు అనేక సేవా రంగాలను ప్రభుత్వమే మెరుగ్గా నిర్వహించాలి. మన దేశం నుంచి ఎగుమతులు పెంచగలిగితే విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండి రూపాయి బలపడుతుంది.    

Advertisment
తాజా కథనాలు