BRS : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి (Telangana State Formation Day) సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.
Also read: ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష!
జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తారు. జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఇదే రోజు హైదరాబాద్ లో పలు దవాఖానాల్లో , అనాథాశ్రమాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లో కూడా దవాఖానల్లో, అనాథాశ్రమాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు. అయితే దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను పాటించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
Also read: రేవంత్ రెడ్డి మైండ్ గేమ్.. ఆ క్రెడిట్ కేసీఆర్ కు దక్కకుండా చేసేందుకు బిగ్ ప్లాన్!