KCR Health Updates: కాలు జారిపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవనున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుండటంతో.. వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేసేందుకు ఓకే చెప్పారు. దాంతో కేసీఆర్.. శుక్రవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే, కేసీఆర్ ఆస్పత్రి నుంచి నేరుగా నంది నగర్‌లోని తన ఇంటికే వెళ్లనున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ.. వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని తెలిపారు వైద్యులు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజా భవన్(ప్రగతి భవన్) నుంచి నేరుగా ఎర్రవెల్లిలోని తన ఫామ్‌కు వెళ్లారు కేసీఆర్. అయితే, అక్కడ బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. దాంతో ఆయన్ను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో కేసీఆర్ తుంటి వెముక విరిగిపోగా.. ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రమంగా కోలుకుంటుంది. కేసీఆర్‌కు ప్రస్తుతం ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉందని వైద్యులు చెప్పారు. డైట్ కూడా మామూలుగానే తీసుకుంటున్నారని వెల్లడించారు. అంతేకాదు.. త్వరగా కోలుకునేందుకు అవసరమైన వ్యాయామాలు కూడా చేస్తున్నారని తెలిపారు.
ఈ కారణంగానే తన ఇంటికి..
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత కేసీఆర్ నేరుగా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌కే వెళ్తారని అంతా భావించారు. కానీ, ఆయనకు వైద్యుల పర్యవేక్షణ అవసరం అని చెబుతున్నారు. పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎర్రవెల్లికి వెళ్లడం సరికాదని, అందుకే.. హైదరాబాద్‌లోనే ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నందినగర్‌లో ఉన్న తన ఇంటికే వెళ్లాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్.
పదేళ్లు ఖాళీగా..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత.. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. దాంతో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయానికి షిఫ్ట్ అయ్యారు. ప్రజా భవన్(ప్రగతి భవన్) నిర్మాణం పూర్తి చేసి అందులోనే నివాసం ఉంటున్నారు. దాంతో గత పదేళ్లుగా నందినగర్‌లోని కేసీఆర్ ఇళ్లు ఖాళీగా ఉండిపోయింది. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు కేసీఆర్ తన ఇంటికి వెళ్తున్నారు. దాంతో ఆ ఇంటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేస్తున్నారు. రంగులు వేయడం, పాడైపోయిన వాటిని రీప్లేస్ చేయడం చేస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు ఆయన ఇక్కడే ఉండనున్నారు.
Also Read:
రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!
భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు..