Danam Nagendar: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బాగా దెబ్బలు పడుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది.
దానం మీద వేటు...
అయితే దానం చేసిన పనికి బీఆర్ఎస్ మాత్రం మండిపడిపోతోంది. పార్టీకి రాజీనామా చేయకుండా ఎలా వెళ్ళి వేరే పార్టీలో చేరతారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా దీని మీద సీరియస్‌గా ఉన్నరని తెలుస్తోంది. ఒకపక్క కవిత అరెస్ట్‌తో సతమతమవుతున్న పార్టీ పెద్దలు ఇప్పుడు దానం చేసిన పనికి సీరియస్ అవుతున్నారు. అందుకే దానం మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అనర్హత వేటు కోసం స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరారు బీఆర్ఎస్ నేతలు. స్పీకర్ ఇంటికి వెళ్లి మరీ ఫిర్యాదు చేయాలని ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మాగంటి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లు స్పీకర్ ఇంటి దగ్గర వెయిట్ చేశారు. కానీ ఇతర కార్యక్రమాల వల్ల బిజీగా ఉండడంతో స్పీకర్ వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఈరోజు మరోసారి స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం కాంగ్రెస్‌లో చేరడం సరైనది కాదని...ఆయన మీద వేటు వేయాలని బీఆర్ఎస్ కోరనుంది.
సికింద్రాబాద్ ఎంపీ టికెట్..
సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ దానం నాగేందర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయడంతో రంజిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడటంతో హైదరాబాద్ లో ఆ పార్టీకి పెద్ద నష్టమేనని రాజకీయ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ లో మరికొందరు కీలక నేతలు చేరుతారనే టాక్ కూడా వినిపిస్తోంది.
Also Read:MLC Kavitha: కవిత భర్తను విచారించనున్న ఈడీ